గంటాను గెంటేస్తారా..? ఆయనే వెళ్లిపోతారా..?

First Published Jun 20, 2018, 12:10 PM IST
Highlights

గంటాను గెంటేస్తారా..? ఆయనే వెళ్లిపోతారా..?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్రలో బలమైన నేత గంటా శ్రీనివాసరావు మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి రాకపోవడం.. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వార్తతో ఆయన పార్టీ మారబోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పొటీ చేయరంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. పుట్టింది నెల్లూరు జిల్లా అయినా విశాఖను తన కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని.. టీడీపీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కాంగ్రెస్‌లో, పీఆర్‌పీలో, మళ్లీ టీడీపీలో చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నారు గంటా..

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మంత్రి పదవులు అనుభవించగలడని.. లక్కున్న రాజకీయనాయకునిగానూ ఆయనకు పేరు.. తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక పాత్రే దక్కింది కొన్నేళ్ల వరకు.. అయితే విశాఖ నగరంలో అనేక భూకబ్జా ఆరోపణలు, సీనియర్ నేత, సహచర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో విభేదాలు గంటా ప్రతిష్టకు మచ్చ తెచ్చాయి. దీనికి తోడు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.. విధాన నిర్ణయాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో గతంలో ఇచ్చినంత ప్రాముఖ్యతను చంద్రబాబు ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి..

స్వయంగా పార్టీ అధినేత నుంచి సరైన సహకారం లేకపోవడంతో.. టీడీపీలో ఉన్న కొన్ని శక్తులు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని గంటా భావిస్తున్నారు.. వాటిని ఎప్పటికప్పుడు అధినాయకత్వం దృష్టికి తీసుకువెళుతున్నా ఎలాంటి ఫలితం లేదని శ్రీనివాసరావు సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారట. తాజాగా సర్వే పేరుతో సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకత ఉందనేలా.. ఈ సారి టికెట్ ఇస్తే... ఫలితం లేదన్నట్లుగా ప్రచారం చేశారని.. అందుకు పార్టీయే మద్ధతు ఇచ్చినట్లు గంటా భావిస్తున్నారు.

అంతేకాకుండా ప్రభుత్వ భూములు తనఖాపెట్టి బ్యాంకుల వద్ద నుంచి రుణం తీసుకున్నారని.. విశాఖ భూముల కుంభకోణంలో తన పేరు రావడం వెనుక, హైకోర్టులో పిల్ వేయడం వెనుక పార్టీలో కొందరి పాత్ర ఉందన్నది ఆయన అనుమానం.. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలను అధినేతకు సమర్పించినా పట్టించుకోకపోగా.. నాటి నుంచి తనపైన ఆరోపణలు ఎక్కువవ్వడం ఇత్యాది ఘటనలతో తనను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు కుట్ర జరుగుతుందని గంటా కొందరు సన్నిహితుల వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

వారు పంపేలోగా తన దారి తానే చూసుకోవాలని మంత్రి డిసైడ్ అయ్యారని విశాఖలో ప్రచారం జరగుతుంది.. జనసేనలో చేరితే ఎలాగూ సముచిత స్థానం దొరుకుతుంది.. అక్కడ పవన్ తర్వాత నెంబర్ 2 పోజిషన్ పక్కాగా గంటాదే.. ఇక వైసీపీ విషయానికి వస్తే... ఆ పార్టీలోనూ గంటా వస్తానంటే రావద్దు అనేవారు ఎవరు లేరు.. గురువారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి.. తన వెనుక జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని.. సీఎం స్పందన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటించాలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు.
 

click me!