గంజాయి స్మగ్లర్ కారులో పోలీస్ కుటుంబం షికారు... వివాదంలో అనకాపల్లి డిఎస్పీ

Published : Feb 12, 2023, 08:59 AM IST
గంజాయి స్మగ్లర్ కారులో పోలీస్ కుటుంబం షికారు... వివాదంలో అనకాపల్లి డిఎస్పీ

సారాంశం

అనకాపల్లి డిఎస్పీ సునీల్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఓ గంజాయి స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డ కారులో డిఎస్పీ కుటుంబంతో కలిసి షికారుకెళ్లి అడ్డంగా బుక్కయ్యారు. 

అనకాపల్లి : తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీస్ ఉన్నతాధికారే తప్పుడు పని చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన వాహనాన్ని కాదని గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డ వాహనంలో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుటుంబంతో షికారుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. కారు నంబర్ ప్లేట్ మార్చి మరీ సదరు డిఎస్పీ సొంత అవసరాలకు కారు వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. విషయం బయటపడటంతో పోలీస్ ఉన్నతాధికారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే... అనకాపల్లి డిఎస్పీగా బి.సునీల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన సివిల్ విషయాల్లో తలదూరుస్తున్నారని... భూ వివాదాల్లో సెటిల్ మెంట్లకు పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు వున్నాయి. ఇలా ఇప్పటికే డిఎస్పీ తీరు వివాదాస్పదంగా మారగా గంజాయి స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డ వాహనాన్ని సొంత అవసరాలకు వాడుకుని మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 

Video  కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో గతేడాది గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసారు. ఆ కారు జి. మాడుగులలో వుంటూ గంజాయి వ్యాపారం చేస్తున్న రాజస్థాన్ వాసి సింగ్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అతడి విచారణ నిమిత్తం పిలవగా మరో కారులో పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. గంజాయి స్మగ్లింగ్ నిజమేనని విచారణలో తేలడంతో సింగ్ ను అరెస్ట్ చేసారు. దీంతో అతడు వచ్చిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్లోనే వుంచారు. 

అనకాపల్లి పోలీసుల గంజాయి కేసులో స్వాధీనం చేసుకున్న కారులోనే తాజాగా డిఎస్పీ సునీల్ కుటుంబంతో కలిసి విశాఖపట్నం బీచ్ కు వెళ్ళాడు. అయితే బీచ్ రోడ్డులో డిఎస్పీ తీసుకెళ్లిన కారు మరో వాహనాన్ని ఢీకొట్టగా అక్కడే వున్న కొందరు వీడియో తీసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో డిఎస్పీ సునీల్ ఉపయోగిస్తున్న కారు భాగోతం బయటపడింది. నేరస్తుడి కారును వాడటమే తప్పయితే దాని నంబర్ ప్లేట్ ను మార్చి మరీ ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. 

డిఎస్పీ సునీల్ వ్యవహారం వివాదానికి దారితీయడంతో అనకాపల్లి ఎస్పీ గౌతమి స్పందించారు. డిఎస్పీ గంజాయి స్మగ్లర్ వద్ద స్వాధీనం చేసుకున్న కారులో ప్రయాణించినట్లు తమ దృష్టికి వచ్చిందని... దీనిపై ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించామన్నారు. నేరం చేసినట్లు రుజువయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఎస్పీపై చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్