హోదా వద్దు... ఉద్యోగాలొద్దు... వివక్ష పాలనే ముద్దు..: జగన్ పాలనపై అనగాని సెటైర్లు

By Arun Kumar PFirst Published Mar 21, 2021, 11:14 AM IST
Highlights

పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఊసే ఎత్తడం లేదని...ఇక రాష్ట్రంలో జగన్ రెడ్డి రాజధాని పేరు ప్రస్తావించడం లేదన్నారు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. 

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అరాచకానికి, గూండాయిజానికి ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్రాభివృద్ధికి ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఊసే ఎత్తడం లేదని...ఇక రాష్ట్రంలో జగన్ రెడ్డి రాజధాని పేరు ప్రస్తావించడం లేదన్నారు. రాష్ట్రం వైసీపీ దుష్ట్ర శక్తులు చేతిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోందన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామన్న వైసీపీ ఎంపీలు ఎందుకు తలలు దించుకుంటున్నారు? అని నిలదీశారు. 

''ప్రతిపక్షంలో వుండగా ప్రత్యేకహోదా తెస్తానని జగన్ రెడ్డి ఎంత రాద్దాంతం చేశాడు. ప్రజల్ని ఏ విధంగా నమ్మించి అరచేతిలో వైకుంఠం చూపించాడు. నేడు ఆయనకి హోదా వచ్చింది కాబట్టి రాష్ట్రానికి  హోదా అవసరం లేదు.  కేసుల మాఫీ కోసం హోదా తాకట్టు పెడుతున్నాడు. హోదా అనే పదాన్ని జగన్ రెడ్డి మర్చిపోయారు'' అని అన్నారు. 

''హోదా తెచ్చి ప్రతి గ్రామాన్ని మరో హైదరాబాద్ చేస్తానన్నాడు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఇప్పుడు లేదు. కేసులు మాఫీ కోసం హోదాని తాకట్టు పెట్టాడు. హోదా ఎప్పుడు తెస్తావని ప్రజలంతా వైసీపీని నిలదీయాలి. కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం సాధించిపెట్టారు.? రాష్ట్ర అభివృద్దికి బదులు  వైసీపీ అభివృద్దికే  ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు రోడ్లపైకి  వచ్చి ఆందోళనలు చేశారా? హింసాంత్మక  ఘటనలు వున్నాయా?'' అని ప్రశ్నించారు.

''ఇసుక కోసం భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారా? విత్తనాల కోసం రైతులు కరెంటు తీగలు పట్టుకున్నారా? చంద్రబాబు చేపట్టిన ఏ పనినీ జగన్ రెడ్డి ముందుకు సాగనివ్వడం లేదు. రాజధాని లేకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? చంద్రబాబు సంక్షోభాల నుండి నుండి అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్తే జగన్ ప్రభుత్వం సంక్షోభాలు సృష్టించి అమరావతిని, రాష్ట్రాభివృద్దిని నిలిపివేసింది'' అని పేర్కొన్నారు. 

read more  ప్రశ్నిస్తే తప్పుడు కేసులా.. జైల్లో చిత్రహింసలు పెట్టారు: టీడీపీ నేత రామకృష్ణారెడ్డి ఆరోపణలు

''హోదా వద్దు.. యువతకు ఉద్యోగం వద్దు.. వివక్ష పాలనే ముద్దు అన్నట్లుగా జగన్ రెడ్డి తీరు ఉంది. రాష్ట్ర ప్రజలపై అప్పుల కుంపటి పెట్టి పన్నుల వడ్డింపుతో వేధిస్తున్నారు. రెండేళ్లు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను వంచిస్తున్నారు. పోలవరాన్ని అదోగతి పాలు చేసి రైతులను సంక్షోభంలోకి నెడుతున్నారు. రాజధానిలో 90 శాతం పరిపాలన భవనాలు పూర్తైనా పక్కనపెట్టేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులను 460 రోజులుగా వేధిస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి'' అని మండిపడ్డారు.

''గుర్తొచ్చినప్పుడు ఏదో ఒక కేసు తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. రాజధానిలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటి దాకా నలుగురు వైసీపీ నేతలతో కేసులు వేయించారు. నిరూపించింది మాత్రం శూన్యం. నింగిని తాకే భవనాలున్నా గ్రాఫిక్స్ అంటూ ఫేక్ ప్రచారం చేశారు. స్వచ్ఛందంగానే భూములిచ్చామని, లబ్ధి కూడా పొందామని రైతులు చెప్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు.?'' అని నిలదీశారు.

''122 మంది రైతులు, కూలీలు మనోవేధనతో చనిపోతే ఎందుకు పరామర్శించలేదు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పైనా ప్రజలు సీఐడీ ఫిర్యాదు చేయవచ్చు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తోడేస్తున్న వైసీపీ ప్రభుత్వంపైనా సీఐడీ కేసు నమోదు చేయాలి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ వైసీపీని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీది నిజమైన గెలుపుకాదని వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారు'' అని అనగాని హెచ్చరించారు. 
 

click me!