
విశాఖపట్నంలోని వాల్తేరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి సమయంలో దేవాలయంలోకి చొరబడ్డ దుండగులు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాల దోచుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన దేవాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఈ ఛోరీ గురించి బయటపడింది.
వివరాల్లోకి వెళితే... విశాఖపట్పం వాల్తేరులో పోలమాంబ ఆలయం వుంది. ఆలయంలో అమ్మవారికి నిత్యం వెండి కిరీటంతో పాటు బంగారు ఆభరణాలతో అలంకరిస్తుంటారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు దుండగులు ఆ ఆభరణాలపై కన్నేశారు. అదును చూసుకుని అమ్మవారి ఆభరణాలను దోచేయాలని కుట్ర పన్నారు.
ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భాలయ తాళాన్ని పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. అమ్మవారికి అలంకరించి వెండి కిరీటం, బంగారు ఆభరణాలతో పాటు పూజకు ఉపయోగించే వెండి వస్తువులను సైతం దోచుకెళ్లారు.
ఆదివారం తెల్లవారుజామున గర్భాలయ తాళం పగిలిపోయి వుండటాన్ని గమనించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయలయానికి చేరుకున్న పోలీసులు గర్భాలయాన్ని పరిశీలించగా అమ్మవారి ఆభరణాలు మాయం అయినట్లు గుర్తించారు. దీంతో దేవాలయ అధికారుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.