అమరావతి తరలింపును నిరసిస్తూ లెఫ్ట్ పార్టీల నేతలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు బుధవారం నాడు కలిశారు.
అమరావతి: అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల నాయకులను కలిశారు నేతలు. తమకు అండగా నిలవాలని అమరావతి పరిరక్షణ సమతి నేతలు కోరారు.
also read:లాయర్ల మధ్య కర్నూలు చిచ్చు: రెండుగా చీలిన ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్
బుధవారం నాడు విజయవాడలోని సీపీఐ, సీపీఎం నేతలను అమరావతి పరిరక్షణసమితి నేతలు కలిశారు. రాజధాని తరలింపును సీపీఐ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ స్పష్టం చేసింది.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ కాదని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. రాజధాని పరిరక్షణ సమితి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.
తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం తరువాత మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని లేకుండానే విశాఖ అభివృద్ధి చెందింది, వనరులు ఉన్నాయి కనుకే విశాఖ అభివృద్ధి చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా రాజధాని తరలింపుతో విశాఖ అభివృద్ధి చెందేదేమి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు.
సీపీఎం అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటుంది పాలనా వికేంద్రీకరణ కాదని ఆ పార్టీ నేతలు కూడ స్పష్టం చేశారు. మద్రాసు నుండి విడిపోయినప్పుడే రాజధాని గా వామపక్ష పార్టీలు విజయవాడను ప్రతిపాదించిన విషయాన్ని సీపీఎం నేతలు గుర్తు చేశారు.
వామపక్షాల బలం ఉన్నందున అప్పుడు రాజధానిని కర్నూలుకు తరలించారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.