చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే...

Published : Apr 26, 2017, 07:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే...

సారాంశం

ఇంతవరకూ చంద్రబాబు నుండి వారెవరికీ ఫోన్ రాలేదు. భవిష్యత్తులో కూడా వారిని చంద్రబాబు దగ్గరకు తీసుకుంటారన్న నమ్మకమూ లేదు. ఎందుకంటే, వారంతా రాజకీయాల్లో దాదాపు చివరి దశకు చేరుకున్నరు. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు దక్కేది కూడా అనుమానమే. అటువంటప్పుడు వారితో చంద్రబాబు ఎందుకు మాట్లాడుతారు?

అస్సమ్మతిని హ్యాండిల్ చేయటంలో ఒక్కొక్కళ్ళది ఒక్కో పద్దతి. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయం విచిత్రంగా ఉంటుంది.  ఇతర పార్టీల్లో అయితే అసమ్మతి రాజకీయాలు నడిపే వారిని, పార్టీ అధిష్టానానికి ఎదురుతిరిగిన వారిపై ఏదో ఒక చర్య ఉంటుంది. అదే చంద్రబాబు అయితే  ఏం చేయరు. వాళ్ళంతట వాళ్ళుగా కనుమరుగైపోయేట్లు చేస్తారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, పార్టీలో కొందరు నేతల విషయంలో అటువంటి రాజకీయమే మొదలైంది కాబట్టి.

మొన్నటి మంత్రివర్గ విస్తరణ తర్వాత చిత్తూరు ఎంపి శివప్రసాద్, విశాఖపట్నంలోని పెందుర్తి శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి, రాజమండ్రి ఎంఎల్ఏ బుచ్చయ్యచౌధరి, శ్రీకాకుళం జిల్లాలోని గౌతు శ్యాంసుందర శివాజి లాంటి కొందరు పరిస్ధితి అలాగే కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని అనుకున్నారు. అయితే వారు ఆశించినట్లుగా జరగలేదు.

మంత్రి పదవులు రాలేదని శివాజి, బండారు లాంటి వాళ్ళు అలిగారు. అలాగే, ఫిరాయింపులకే పెద్ద పీటవేసి సీనియర్లను విస్మరిస్తున్నారంటూ బుచ్చయ్య చౌధరి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అదే సమయంలో ఎస్సీలను చిన్నచూపుచూస్తున్నారని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఎంపి శివప్రసాద్ కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

మంత్రివర్గ విస్తరణ తర్వాత పై నేతలు  చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో కలకలం సృష్టించాయి. అసంతృప్తిని బాహాటంగా వెళ్ళగక్కటమన్నది టిడిపిలో దాదాపు జరగదు. అటువంటిది నేరుగా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించటమంటే మామూలు విషయం కాదు. ఇక్కడే చంద్రబాబు తనమార్కు రాజకీయానికి పదును పెట్టారు. తనపై ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా ఆరోపణలు చేసినా వారిని ఇక పట్టించుకోరు. అందులోనూ పార్టీకి భవిష్యత్తులో వారితో ఎటువంటి లాభమూ లేదనుకుంటే ఇక వారి దారి గోదారే.

మొన్నటి విస్తరణ సందర్భంగా అలిగిన బండారు, శివాజీ, బుచ్చయ్య, శివప్రసాద్ తమకు చంద్రబాబు ఫోన్ చేస్తారని, మాట్లాడుతారని ఆశించారు. సహజం కూడా. అయితే, ఇంతవరకూ చంద్రబాబు నుండి వారెవరికీ ఫోన్ రాలేదు. భవిష్యత్తులో కూడా వారిని చంద్రబాబు దగ్గరకు తీసుకుంటారన్న నమ్మకమూ లేదు. ఎందుకంటే, వారంతా రాజకీయాల్లో దాదాపు చివరి దశకు చేరుకున్నరు. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు దక్కేది కూడా అనుమానమే. అటువంటప్పుడు వారితో చంద్రబాబు ఎందుకు మాట్లాడుతారు?

ఎప్పుడైతే వారిని చంద్రబాబు దూరం పెట్టేసారని పార్టీ నేతలకు తెలిసిందో జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా వారిని దూరం పెట్టేసింది. అంటే వారంతట వారుగా పార్టీలో కనుమరుగైపోవాల్సిందే. లేకపోతే అవకాశం వస్తే చంద్రబాబును కలిసి దాసోహం అనాల్సిందే. వేరే దారిలేదు అటువంటి వాళ్ళకు.

వీరిలాగే బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్ కూడా చంద్రబాబుపై అసంతృప్తి వెళ్ళగక్కారు కదా? మరి వాళ్లను మాత్రం ఎందుకు వెంటనే పిలిపించి మాట్లాడారు? అంటే వాళ్ల వల్ల పార్టీకి ఇంకా ఏదో ఉపయోగం ఉంటుందని చంద్రబాబు అనుకోబట్టే పిలిపించుకుని మాట్లాడారన్నది క్లియర్.

PREV
click me!

Recommended Stories

Indian Women’s Cricket Team Members Visit Narasimha Swamy Temple in Vizag | Asianet News Telugu
Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu