600 మందికి వింత వ్యాధి, అధ్యయనాలు సాగుతున్నాయి: ఆళ్ల నాని

Published : Feb 02, 2021, 05:29 PM IST
600 మందికి వింత వ్యాధి, అధ్యయనాలు సాగుతున్నాయి: ఆళ్ల నాని

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 600 మంది అంతు చిక్కని వ్యాధికి గురయ్యారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వింత వ్యాధులపై నిరంతరం అధ్యయనం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు.

అమరావతి: ఇటీవల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో గుర్తించిన వింత వ్యాధులపై నిరంతర అధ్యయనం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత డిసెంబరు 5 వ తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు లో సుమారు 600 మంది అంతుచిక్కని వ్యాధి బారినపడ్డారన్నారు. 

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి,చర్యలు తీసుకున్న వైనాన్ని మంత్రి గుర్తు చేశారు. వింతవ్యాధి ఇతర ప్రాంతాలకు సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 10న  ఏలూరులో బాధితులను పరామర్శించిన విషయాన్ని ప్రస్తావించారు.

ఏలూరులో వింతవ్యాధి నియంత్రణకు వైద్యారోగ్య శాఖ బాగా కృషి ఫలితంగా ప్రజల్లో ఉన్న భయాన్ని పారదోలగలిగామని మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పూళ్లకొమిరెపల్లి లో కూడా అదే తరహా వింతవ్యాధి సోకడంతో పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ తీసుకున్న చర్యలతో వింతవ్యాధితో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూ 104, 108 వాహనాలతో పాటు మెడికల్ టీమ్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు  వింత వ్యాధి గుర్తింపునకు 21 మందితో ఉన్నత స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ నీరు, పాలు, కూరగాయలు, పంటలు, పలు ఆహార పదార్ధాల నుంచి శాంపిల్స్ తీసుకుని పరిశోధనకు పంపించిందన్నారు. ఆయా పరిశోధన సంస్థల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాయని వీటిని ఆధారం చేసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలనే దానిపై చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.             
         
ఈ సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, వింత వ్యాధిపై ఇప్పటి వరకు ఎయిమ్స్, సీసీఎంబీ, నిమ్స్ వంటి 13 సంస్థల్లో పరిశోధనలు జరిగాయన్నారు. సీసీఎంబీ నివేదికలో ఎలాంటి కారణాలు లేవని బయటపడిందన్నారు. నిమ్స్ నివేదికలో ట్రైజో ఫాస్ ఉందని బయటపడిందన్నారు. బాధితుల రక్త, యూరిన్ పరీక్షల ఫలితాల్లో  లెడ్, నికేల్ ఉన్నట్లు గుర్తించారన్నారు. మిగతా అన్ని సంస్థలు కూడా ఎలాంటి బాక్టీరియా,వైరస్ లేదని తేల్చి చెప్పాయన్నారు. 

ఆ సంస్థల నివేదికల ఆధారంగా  దీర్ఘకాలిక అధ్యయనానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని అనిల్ సింఘాల్ వెల్లడించారు. మెటల్స్ ఎలా కలుస్తున్నాయనే దానిపై రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి అధ్యయనం చేస్తామన్నారు. తొలుత వింత వ్యాధులపై ఉభయగోదావరి జిల్లాల్లో అధ్యయనం చేస్తామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు. 

బాధితుల నుంచి శాంపిళ్లలో బలమైన లోహాలు ఎలా వచ్చాయనేదానిపై పరిశోధనలకు రాష్ట్రంలో ల్యాబ్ లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం 7 శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu