
గాజువాక శ్రీనగర్‌లోని ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్‌సాయిని పోలీసులు సెంట్రల్ జైల్‌కి తరలించారు. అఖిల్ సాయికి అక్కడ ఖైదీ నెంబర్ 7411 కేటాయించారు. ప్రణాళిక ప్రకారమే వరలక్ష్మిని హత్య చేశారని దర్యాప్తులో తేలడంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
ఆదివారం గాజువాక పోలీసులు నిందితుడు అఖిల్ సాయిని అరెస్ట్ చేశారు. అఖిల్ పై దిశ చట్టం ప్రకారం, సెక్షన్ 302 ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. కోవిడ్ టెస్ట్ అనంతరం అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
వరలక్ష్మి బయటకు వచ్చిన సమయంలో... కావాలనే వాగ్వాదానికి దిగి ఎలాగైనా చంపేద్దామని ప్రణాళిక ప్రకరం అఖిల్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు హత్యకు ముందు నాలుగు రోజుల నుంచి వరలక్ష్మిని అఖిల్‌సాయి ఫోన్‌లో వేధించేవాడని, దీంతో ఆమె మనస్తాపానికి గురైందని... బంధువుల పెళ్లి హడావిడిలో కుటుంబ సభ్యులంతా ఉండగా అఖిల్ యువతిని భయపెట్టేవాడని విచారణలో తేలింది.
నిందితుడు అఖిల్, అతని కుటుంబ గత చరిత్రపైనా పోలీసులు దృష్టి సారించారు.అఖిల్ తండ్రి సత్యారావుపై అప్పట్లో 53/11పేరిట రౌడీషీట్ ఉందని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసుకు సంబంధించి పోలీసులు రౌడీషీట్ తెరవగా కొన్నాళ్ల తరువాత సత్యారావు సత్ప్రవర్తన నేపథ్యంలో ఆ షీట్ ఎత్తేశారని చెబుతున్నారు. అయితే ఆయన కుమారుడు అఖిల్ చేసిన హత్య తర్వాత... అఖిల్ తండ్రికి ఎవరెవరు రౌడీషీటర్లతో పరిచయముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.