
అగ్రిగోల్డ్ యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది. తమ గ్రూపుకు చెందిన విలువైన హాయ్ ల్యాండ్ ను కాజేయాలని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేసినట్లు న్యాయస్ధానంకు తెలిపింది. సిఐడి ద్వారా సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు న్యాయస్ధానంలోనే ఆరోపణలు చేయట గమనార్హం. హాయ్ ల్యాండ్ ను అమ్మకుండానే తాము ఖాతాదారులకు డబ్బులు చెల్లిస్తామని కూడా న్యాయస్ధానానికి యాజమాన్యం విన్నవించుకున్నది. అయితే, ఈ విషయమై స్పందించిన న్యాయస్ధానం సిఐడి ఆధ్వర్యంలోనే ఆస్తుల విక్రయాలు చేసి అప్పులను తీర్చాలని సూచించింది.
ఇదిలావుండగా, ఆగ్రిగోల్డ్ సంస్ధల మూసివేత అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సంస్ధల మూసివేత వెనుక ప్రభుత్వంలోని కొందరు పెద్దలున్నారంటూ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. ఏదేమైనా ఖాతాదారులకు నగదు చెల్లింపుల్లో ఎటువంటి బకాయిలు లేనప్పటికీ, ఏ ఖాతాదారుడూ ఫిర్యాదు చేయకుండానే తమపై ప్రభుత్వ కక్షపూరితంగా కేసులు నమోదు చేసిందని ఆగ్రిగోల్డ్ యాజమాన్యం అప్పట్లో ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఎవరి వాదన ఎలాగున్నప్పటికీ సంస్ధ కార్యకలాపాలు మాత్రం మూతపడింది. దాంతో లక్షలాది మంది ఖాతాదారులు రోడ్డునెక్కారు. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఫలితంగా సుమారు ఏడాది కాలంగా సంస్ధ కార్యకలాపాలు స్ధంబించిపోయాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో హాయ్ ల్యాండ్ ఉంది. రాష్ట్ర రాజధాని గుంటూరు జిల్లాలోని అమరావతిగా నిర్ణయమవటంతోనే హాయ్ ల్యాండ్ భూముల విలువ అనూహ్యంగా వేలాది కోట్లకు పెరిగిపోయినట్లు సమాచారం.
సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన హాయ్ ల్యాండ్ ఎంటర్ టైన్ మెంట్ భూములపై ప్రభుత్వంలోని కొందరు పెద్దల కన్నుపడినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. దానిపై సాక్ష్యాధారాలతో సహా మీడియాలో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవటంతో జనాలకు ప్రభుత్వంలోని పెద్దలపై అనేక అనుమానాలు కూడా మొదలయ్యాయి. అప్పట్లో కొందరు మంత్రులు తమపై వచ్చిన ఆరోపణలను కొట్టేసారు. అయితే, తాజాగా సంస్ధ యాజమాన్యమే హాయ్ ల్యాండ్ పై కొందరు పెద్దలు కన్నేసినట్లు ఆరోపణలు చేయటంతో సంచలనంగా మారింది.