
తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో నారా బ్రాహ్మణి యాక్టివ్ అవుతున్నారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు బ్రాహ్మణే అసలు స్టార్ క్యాంపైనర్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్వసనీయ వర్గాల మాట. ఎందుకంటే, టిడిపి తరపున ప్రజలను ఉర్రూతలూగించేలా ప్రసంగించే నేతలు ఎవ్వరూ లేరు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రిలో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు ప్రసంగాల్లో పస తగ్గిపోయింది.
సభల్లో చంద్రబాబు మాటలకు జనాలు స్పందించటం మానేసి చాలా కాలమైపోయింది. ఇటీవల కర్నూలు పర్యటన సందర్భంలో చంద్రబాబు వేదికపై నుండి మాట్లాడుతుంటే సాక్షాత్తు ఆయన మంత్రివర్గ సహచరులే గాఢ నిద్రలో జోగుతుండటమే సాక్ష్యం.
పైగా చాంద్రబాబు స్పీచ్ లో ఎంతసేపూ ఆత్మస్తుతి..పరనిందలే తప్ప ఇంకేమీ ఉండదు. దాంతో జనాలు కూడా బోరు ఫీలవుతున్నారు. దానికితోడు లోకేష్ కూడా మంచి వక్త కాదని ఇప్పటికే ఎన్నోమార్లు రుజవైంది. ప్రత్యర్దులపై లోకేష్ సరైన పంచ్ లను విసరలేకపోతున్నట్లు పార్టీ వర్గాలే వాపోతున్నాయి. లోకేష్ మాటలో పదును ఉండటం లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతసేపు ‘తాత..మనవడి’ కథలే తప్ప ప్రజా సమస్యలు, పరిష్కారాలపై లోకేష్ స్పందించింది తక్కువే.
ఇక మిగిలింది నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రమే. మొన్నటి ఎన్నికల్లో బాలకృష్ణను స్టార్ క్యాంపైనర్ గా తమ నియోజకవర్గాలకు పిలిపించుకోమని చంద్రబాబు చెప్పినా చాలా మంది వద్దన్నారని సమాచారం. ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూ మరో నియోజకవర్గం అభ్యర్ధి పేరు చెప్పటం, అభ్యర్ధి గురించి చెప్పటంలో ప్రతీసారీ తడబడుతుడటం, మితిమీరిన కోపం తదితరాల కారణంగా బాలకృష్ణతో ప్రచారం చేయించుకోవాలంటే పెద్దగా ఎవరూ ఇష్టపడలేదు.
ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికలకు టిడిపి తరపున ఒక స్టార్ క్యాంపైనర్ అవసరం చాలా వుంది. మొన్నటి ఎన్నికల్లో మోడి, పవన్ లాంటి వారు ప్రచారం చేయటంతో వెలితి కనబడలేదు. కానీ వచ్చే ఎన్నికలకు పవన్ టిడిపి తరపున ప్రచారం చేసేదాకా నమ్మకం లేదు. కాబట్టి టిడిపి స్టార్ క్యాంపైనర్ ఎవరంటే పలువురి చూపు బ్రాహ్మణి వైపే చూస్తున్నాయి. బ్రాహ్మణికి ఎలాగూ ఎన్ టిఆర్ మనవరాలుగా ప్రచారం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు బ్రాహ్మణి మాత్రమే.
ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా ప్రజల్లోకి రాకపోవటమే బ్రాహ్మణికున్న పెద్ద ప్లస్ పాయింట్ గా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టిఆర్ ట్రస్ట్ తరపున నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో బ్రాహ్మణి చురుకైన పాత్ర పోషిస్తున్నది. అదే విధంగా ఇటీవలే పార్టీ, ప్రభుత్వ పరిస్ధితిపై ఒక సర్వే చేయించి నివేదిక రూపంలో చంద్రబాబు, లోకేష్ లను హెచ్చరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.