చంద్రబాబు, నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి ఫైర్.. ‘వ్యవసాయం గురించి అసలు ఏం తెలుసు?’

By Mahesh KFirst Published May 16, 2022, 8:23 PM IST
Highlights

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వారికి వ్యవసాయం గురించి అసలు  ఏం తెలుసు అని ప్రశ్నించారు. అలాంటి వాళ్లు ఏ ప్రశ్నలు సంధిస్తారని అడిగారు. కౌలు రైతులకు ఏమి అందుతాయో? ఏ నిబంధనలు ఉంటాయో కూడా వారికి తెలియవని ఫైర్ అయ్యారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. టీడీపీ నేతలు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై విమర్శలు సంధించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టడంపై చంద్రబాబు నాయుడు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ మీటర్లపై ఆయన వైఖరి ఔనంటే.. కాదనిలే అనే తీరులో ఉంటుందని వివరించారు. అసలు వ్యవసాయం గురించి తెలియని వ్యక్తి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఏమి అందుతాయో, ఏ నిబంధనలు ఉంటాయో కూడా తెలియనివాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని, యాత్రలు కూడా చేస్తుంటారని వ్యంగ్యంగా మాట్లాడారు. 

చంద్రబాబు నాయుడు.. విద్యుత్ మీటర్లు పెడితే ఎందుకు పెట్టారంటారని, అదే విద్యుత్ మీటర్లు పెట్టకుంటే ఎందుకు పెట్టట్లేదని అడుగుతారని మంత్రి కాకాణి విమర్శించారు. నిజానికి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే రైతులకు వచ్చే నష్టేమేమీ లేదని అన్నారు. ఏ ప్రాంతాలకు, ఏ ఫీడర్లకు ఎంత కరెంట్ వెళ్లుతున్నదో తెలుసుకోవడానికి ఈ మీటర్లు ఉపకరిస్తాయని, అంతేకాదు, విద్యుత్ సరఫరాలో లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి కూడీ ఈ మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు.

తమ ప్రభుత్వం రైతులకు భరోసాగా ఉంటే అందుకు హర్షించకుండా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కాకాణి అన్నారు. సీఎం జగన్.. కేవలం రైతు భరోసా పథకం ద్వారా దాదాపు రూ. 24 వేల కోట్లు అందించారని వివరించారు. రైతులకు తాము చేస్తున్న మేలును తట్టుకోలేక, వారికి ఓట్లు పడవేమోననే భయంతో చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గాలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం చంద్రబాబు నైజం అని ఫైర్ అయ్యారు.

మే 16న వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్ము తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రూ. 23.785 వేల కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి మాట్లాడారు. జూన్ 6వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు రథం పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. మూడు వేల ట్రాక్టర్లను ఒకే రోజు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

click me!