విజయారెడ్డి హత్య ప్రభావం.. రూట్ మార్చిన రైతులు.. పెట్రోల్ చేతపట్టి..

By telugu teamFirst Published Nov 7, 2019, 8:42 AM IST
Highlights

‘నా పొలంలో మురికి కాలువ తవ్విస్తావా.. నాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రాకుండా చేస్తావా’ అంటూ దూషించాడు. ‘నిన్ను పెట్రోల్‌ పోసి చంపేస్తా.. నేనూ పెట్రోల్‌ పోసుకుంటా’ అంటూ బ్యాగ్‌లోంచి పెట్రోల్‌ బాటిల్‌ తీసి తన శరీరంపై పోసుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో సభలో ఉన్న అధికారులు, ఇతరులపై పెట్రోల్‌ పడింది.

ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దార్ విజయారెడ్డిని ఓ కౌలు రైతు పెట్రోల్ పోసి తగలపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తన భూమి విషయంలోనే నిందితుడు సురేష్.. తహసీల్దార్ ని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిది... ఒప్పు ఎవరిది అన్న విషయం ఇంకా తేలలేదు. అయితే... ఈ ఘనటతో కొందరు రైతులు తమ తీరును మార్చుకున్నారు. తమ భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్న అధికారులను చేతిలో పెట్రోల్ పట్టుకొని బెదిరిస్తుండటం గమనార్హం. ఇలాంటి సంఘటనే ఇప్పుడు శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.

AlsoRead విజయారెడ్డి అంత్యక్రియల్లో...సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం...

పూర్తి వివరాల్లోకి వెళితే.... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మం డలం దూకలపాడులో బుధవారం వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకొచ్చిన అల్లు జగన్‌మోహనరావు అనే రైతు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.సుమలతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

 ‘నా పొలంలో మురికి కాలువ తవ్విస్తావా.. నాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రాకుండా చేస్తావా’ అంటూ దూషించాడు. ‘నిన్ను పెట్రోల్‌ పోసి చంపేస్తా.. నేనూ పెట్రోల్‌ పోసుకుంటా’ అంటూ బ్యాగ్‌లోంచి పెట్రోల్‌ బాటిల్‌ తీసి తన శరీరంపై పోసుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో సభలో ఉన్న అధికారులు, ఇతరులపై పెట్రోల్‌ పడింది.

అగ్గిపుల్ల తీయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో మహిళా అధికారులు, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీపీవో సమీక్షించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఫోన్‌లో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి అధైర్యపడవద్దని చెప్పారు. నిర్భయంగా విధులు నిర్వహించాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు.

AlsoRead వెనుక గేటు నుండి వచ్చి ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్...

కాగా.. సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ లో...  విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాడు. కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు.

తనకు పట్టా రాదనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్టు కౌలు రైతు సురేశ్‌ చెప్పాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం. నిందితుడు సురేష్ కూడా 60శాతం గాయపడగా... అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భూ వివాదంలో తహసీల్దార్ తనకు మద్దతు ఇవ్వనందుకే చంపేసినట్లు సురేష్ అంగీకరించాడు. కాగా.. సురేష్ వెనక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

click me!