క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆనందయ్య మందుకు అనుమతిని ఇవ్వనుందని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
అమరావతి: క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆనందయ్య మందుకు అనుమతిని ఇవ్వనుందని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆనందయ్య మందుపై పలు విషయాలను వెల్లడించారు. సీపీఆర్ఏఎస్, టీటీడీ ఆయుర్వేద కాలేజీ అధ్యయనం చేసిన తర్వాత ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందన్నారు. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఓ నిర్ణయం తీసుకొంటుందన్నారు. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందుపై ఒక నిర్ణయం తీసుకొంటుందని ఆయన చెప్పారు.
also read:ఆనందయ్య కరోనా మందు: ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
రానున్న ఐదారు రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి కానుందని ఆయన తెలిపారు. ఆనందయ్య తయారు చేసిన మందుపై కేంద్ర ఆయుష్ సంస్థతో కలిసి టీటీడీ ఆయుర్వేద కాలేజీ అధ్యయనం చేస్తోందని టీటీడీ ఛైర్మెన్ తెలిపారు. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకొన్న 500 మంది నుండి డేటా సేకరిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారన్నారు. ఈ మందుపై ఐసీఎంఆర్ చేయగలిగిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మందులో ఉపయోగించిన పదార్ధాలు ఏవీ కూడ మనుషులకు ఎలాంటి హాని కల్గించవని ఆయుర్వేద కాలేజీకి చెందిన వైద్యులు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ మందు కరోనాను తగ్గిస్తోందా లేదా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తోందా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల తర్వాతే ఈ విషయమై స్పష్టత రానుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.