64 ఏళ్ల తర్వాత గుంటూరులో హైకోర్టు

By narsimha lodeFirst Published Jan 1, 2019, 6:12 PM IST
Highlights

ఉమ్మడి హైకోర్టును విభజించడంతో   64 ఏళ్ల తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో హైకోర్టు తిరిగి పనులను ప్రారంభించింది. 


అమరావతి: ఉమ్మడి హైకోర్టును విభజించడంతో   64 ఏళ్ల తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో హైకోర్టు తిరిగి పనులను ప్రారంభించింది. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా ఏపీ హైకోర్టు ఇవాళ్టి నుండి  పనులను ప్రారంభించింది.

2014 ఎన్నికలకు ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడ  రెండు రాష్ట్రాల హైకోర్టులు మాత్రం  విభజన జరగలేదు. ఉమ్మడి హైకోర్టును విభజించాలని  తెలంగాణ సీఎం పలుమార్లు డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తైంది. ఇవాళ్టి నుండి  ఏపీకి, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేస్తున్నాయి.

రెండు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లతో గవర్నర్ నరసింహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.  1953లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక 1954 జూలై5వ తేదీన హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు పనిచేశారు.  మూడేళ్ల పాటు గుంటూరులోనే హైకోర్టు కొనసాగింది.

 తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ కోకా సుబ్బారావు 1958లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 1966లో సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆ పదవిలో ఉండి అనేక కీలక తీర్పులు వెలువరించారు. 

ప్రాథమిక హక్కులను మార్చడానికి వీల్లేదని ‘గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌’ కేసులో సంచలన తీర్పు ప్రకటించారు. ప్రాథమిక హక్కులకు సంబంధించి న్యాయస్థానాలు ఎలాంటి కేసులను విచారించినా ఈ తీర్పే ప్రాతిపదికగా ఉంటూ వస్తోంది.

 1967లో ఆయన రిటైరయ్యాక.. ఆ ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఆయన్ను తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. రాష్ట్రపతిగా జాకీర్‌ హుస్సేన్‌ గెలుపొందారు.

ఆ తర్వాత పరిణామాల్లో ఆంధ్ర, హైద్రాబాద్ రాష్ట్రాలు కలిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌కు హైకోర్టు మారింది. సుదీర్ఘ కాలం హైకోర్టు హైద్రాబాద్‌లోనే ఉంది. రెండు వేర్వేరు రాష్ట్రాలు కావడంతో  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు హైకోర్టులు వేర్వేరుగా ఇవాళ్టి నుండి పనిచేస్తున్నాయి.


 

click me!