సలహాల కోసమే, రాజకీయాల కోసం కాదు: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Feb 13, 2019, 8:26 PM IST
Highlights

సలహామండలిలోని సభ్యులంతా వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పనిచేస్తున్నారని వారంతా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా దేశ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జనసేనకు విలువైన సూచనలు సలహాలు అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నారని తెలిపారు. 
 
విజయవాడ: జనసేన పార్టీ సలహా మండలిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సలహామండలి కేవలం విలువైన సూచల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. సలహమండలి చైర్మన్ గా విష్ణురాజును, సభ్యులుగా పొన్నురాజ్, సుధాకర్ రావులను నియమించినట్లు తెలిపారు. 

దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. విలువైన సలహాల కోసమే.. రాజకీయాల కోసం కాదు అంటూ సలహామండలిపై ప్రెస్‌నోట్‌లో పవన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పాతిక కేజీల బియ్యంతోనే ఆగిపోకుండా పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును యువతకు అందించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. 

అలాంటి గొప్ప లక్ష్యాన్ని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి చాలా మంది మేధావుల సలహాలు అత్యంత ఆవశ్యకమని చెప్పుకొచ్చారు. అందుకే జనసేన సలహా మండలిని ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 

సలహామండలిలోని సభ్యులంతా వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పనిచేస్తున్నారని వారంతా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా దేశ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జనసేనకు విలువైన సూచనలు సలహాలు అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నారని తెలిపారు. 

మరోవైపు నరసాపురం లోక్ సభ స్థానానికి జనసేన నుంచి ఎవరిని పోటీలో నిలబెట్టాలో పార్టీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ, జనరల్ బాడీ నిర్ణయిస్తోందని అప్పటి వరకు ఎవరూ ఎలాంటి ప్రచారాలు జరపవద్దని కోరుతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. 
 
విలువైన స‌ల‌హాల కోస‌మే... రాజ‌కీయాల‌కు కాదు pic.twitter.com/j4j0WeclUo

— JanaSena Party (@JanaSenaParty)
click me!