ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సహానీ ఇవాళ ఉద్యోగ విరమణ చేశారు. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం సీఎం ముఖ్య సలహాదారుగా నియమించింది.
నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే.గురువారం నాడు మధ్యాహ్నం మూడున్నర గంటలకు నీలం సహానీ నుండి ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ గా తనకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అజెండానే మా ఎజెండాఅని ఆయన చెప్పారు.
అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకొన్నారన్నారు. సీఎం పెట్టిన లక్ష్యం మేరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.