
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు మంగళవారం రోజున రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై సినీ నటి జయప్రద స్పందించారు. చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశీర్వాదంతో చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని అన్నారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఇలాంటి అరెస్ట్‌లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఈరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 4 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలని పేర్కొంది. బెయిల్ గడువు ముగిసిన తర్వాత సరెండ్ అయ్యే సమయంలో ఆస్పత్రిలో చికిత్స వివరాలను సీల్డ్ కవర్‌లో జైలు సూపరింటెండెంట్ సమర్పించాలని పేర్కొంది.