
సినీ నటుడు మంచు మనోజ్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా, రాజకీయాలు.. ఇలా ప్రతి దానిపై తనకు ఏది అదనిపిస్తే.. అది ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా.. ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని విషయంలో.. ప్రధాని నరేంద్రమోదీ కి శాపాలు పెట్టారు. హామీలు నెరవేర్చకుంటే.. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురౌతారని హెచ్చరించారు.
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బడ్జెట్ లో ఏపీకి మొండి చెయ్యి చూపించింది. కనీసం స్పెషల్ స్టేటస్ ఊసుకూడా ఎత్తలేదు. దీనిపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పీఎం నరేంద్రమోదీ, ఇంతకాలం మీరు చేస్తున్న యుద్ధంలో మేమంతా మీతో ఉన్నాం. మాకిచ్చిన వాగ్ధానాలని నెరవేరుస్తారని, ఇన్ని రోజులు మిమ్మల్నే సపోర్ట్ చేస్తూ వచ్చాం. అయితే స్పెషల్ స్టేటస్ కాదు కదా, మీ దగ్గర నుండి కనీసం కృతజ్ఞతా భావం కూడా రాలేదు. ఇప్పటికైనా మా డిమాండ్‌ని గౌరవించి మా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే మీరు ఎవరి సన్నిధిలో ప్రమాణంలో చేశారో, వారి ఆగ్రహానికి గురికాక తప్పదు’’ అంటూ ఘాటైన ట్వీట్ చేశాడు మనోజ్. దీనిపై పలువురు నెటిజన్స్ హర్షం వ్యక్తం చేశారు.
ఒక నెటిజన్ మాత్రం.. హామీలు నెరవేర్చకుంటే.. దేవుడు శపిస్తాడు లాంటి కామెంట్స్ ఎందుకు భయ్యా అని ట్వీట్ చేయగా.. ఫ్రెంచ్ ప్రజలతో మనం ఫ్రెంచ్ లోనే మాట్లాడాలి.. నేను చెప్పింది మీకు అర్థమయ్యింది కదా భయ్యా అంటూ మనోజ్ రిప్లై ఇచ్చారు.