టిడిపి, వైసిపిలకు అసలైన పరీక్ష...

First Published Nov 24, 2017, 7:34 AM IST
Highlights
  • వచ్చే ఏడాదంతా ఎన్నికల కాలమేనా? ప్రభుత్వ ఆలోచన చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.

వచ్చే ఏడాదంతా ఎన్నికల కాలమేనా? ప్రభుత్వ ఆలోచన చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే, వచ్చే ఏడాదిలోనే పంచాయితీ, మున్సిపాలిటీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందట. పోయిన అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందే అంటే సమైక్య రాష్ట్రంలోనే పంచాయితీ, మున్సిపాలిటీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగిన సంగతి అందరకీ తెలిసిందే. అయితే, ఫలితాలు మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతే వచ్చాయి.

స్ధానిక సంస్ధల ఎన్నికలన్నింటినీ వచ్చే ఏడాది మార్చినెల తర్వాత వరుసగా నిర్వహించేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. పదవి కాలం పూర్తయ్యే ఆరుమాసాల ముందు ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించవచ్చన్న చట్టంలోని వెసులుబాటును ప్రభుత్వం ఉపయోగించుకోవాలని అనుకుంటోందట. వచ్చే ఏడాది పరీక్షల సీజన్ ముగియగానే వరుసబెట్టి అన్నీ ఎన్నికలను నిర్వహించేయాలని ప్రభుత్వం అనుకుంటోందని సమాచారం.

అంటే మార్చి నెల ప్రాంతంలో పంచాయితీ ఎన్నికలు, సెప్టెంబర్ ప్రాంతంలో మున్సిపాలిటీలు తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ప్లాన్ గా కనబడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ఎన్నికలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందే స్దానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని పంచాయితీ సర్పంచుల సంఘంలోని పలువురు నేతలు (టిడిపి) నుండి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. అదేవిధంగా కొత్త మున్సిపాలిటీలు, పాంచాయితీల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉంది. కాబట్టి క్షేత్రస్ధాయి సమస్యలను అన్నింటినీ క్లియర్  చేసి ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలన్నది ఆలోచన.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం, పట్టణ రహదారుల సుందరీకరణ, భూగర్భ డ్రైనేజి వ్యవస్ధ తదితరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగానే స్ధానిక ఎన్నికలు నిర్వహించేస్తే వీలైనంతలో ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేయవచ్చని కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే, స్ధానిక సంస్ధలకు ముందస్తు ఎన్నికల నిర్వహణ పట్ల చాలామంది ఎంఎల్ఏలు ఇష్టపడటం లేదు. ఎందుకంటే, వాటి ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమపై పడుతుందని వాళ్ళ భయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

click me!