అచ్యుతాపురం ప్రమాదానికి వైఎస్ జగనే కారణం...అదెలాగో వివరించిన మంత్రి వాసంశెట్టి

By Arun Kumar P  |  First Published Aug 21, 2024, 11:34 PM IST

అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్ర‌మాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ... జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని అన్నారు.


అమరావతి : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదం మారణహోమం సృష్టించింది. ఎస్సెన్షియా ఫార్మా కంపనీలో రియాక్టర్ పేలి 18 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కంపనీలో వందలాదిమంది పనిచేస్తున్న నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  మంత్రులు వాసంశెట్టి సుభాష్, టిజి భరత్ రియాక్ట్ అయ్యారు. 

మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే ఈ ప్రమాదానికి గత వైసిపి ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన థర్డ్ పార్టీ ఏజన్సీ విధానంవల్లే కంపనీల్లో భద్రతా ప్రమాణాలు తగ్గాయి... దీంతో ప్రమాదాలు పెరిగిపోయానని అన్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదంలో కూడా భద్రతా లోపాలే కారణమై వుంటాయని మంత్రి అనుమానం వ్యక్తం చేసారు.

Latest Videos

గత ప్రభుత్వంలో కార్మిక శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. కార్మికులకు వైద్యసేవల అందించే ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్వహణ కూడా సరిగ్గా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోవడం దారుణమన్నారు. సమస్యలన్నింటినీ సరిదిద్దేందుకు అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించినట్లు... కార్మిక శాఖకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 

ఇక ఈ అచ్యతాపురం సెజ్ ప్రమాద ఘటనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీలతో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య‌ సేవ‌లు అందించాల‌ని చెప్పారు. హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో ఫోన్‌లో మాట్లాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని టిజి భ‌ర‌త్ కోరారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు అక్క‌డే ఉండి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని ఆయ‌న‌ ఆదేశించారు.

ఇక సీఎం చంద్రబాబు నాయుడు   రేపు(గురువారం) చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలో ప్రమాదం జరిగిన కంపనీని పరిశీలించనున్నారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు మృతుల కుటుంబాలను  పరామర్శించనున్నారు. 

ఈ ఘటనపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

ఇక ఈ ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా...ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రాణాలతో చెలగాటం ఆడే ఎవ్వరినీ వదిలిపెట్టబోమయని చంద్రబాబు అన్నారు. 


 

click me!