
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ (tdp) అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా చేరుకున్న చంద్రబాబు.. గొల్లప్రోలులో పర్యటించారు. ఈ సందర్భంగా అధినేతకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు కాన్వాయ్‌లోని ఓ కారును పట్టుకుని ముందుకు సాగిన టీడీపీ కార్యకర్త ఒకరు పట్టు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు కాగా... పార్టీ శ్రేణులు అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై Chandrababu Naidu శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ఓ మెట్టు దిగుతానన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్ధించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారానికి తెర తీసింది. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
గతంలో కుప్పంలో చంద్రబాబు టూర్ సమయంలో కూడా జనసేనతో పొత్తుపై ఓ కార్యకర్త ప్రశ్నించారు. అయితే వన్ సైడ్ లవ్ సరైంది కాదని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు. బీజేపీతో జనసేన మధ్య పొత్తు ఉంది. వచ్చే ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. కానీ ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల కాలంలో అగాధం పెరిగిందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ నాయకత్వం ఖండిస్తుంది. జనసేన నేతలు కూడా తమ మధ్య దూరం పెరగలేదని చెబుతున్నారు. అయితే ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.