ఏసీబీకి చిక్కిన వెహికల్ ఇన్ స్పెక్టర్.. లాకర్లలో బంగారం దుకాణమే దాచాడు

By ramya neerukondaFirst Published Nov 6, 2018, 11:10 AM IST
Highlights

అవినీతి ఆరోపణల్లో భాగంగా సోదాలు చేసిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. అతని పేరిట ఉన్న బ్యాంకు లాకర్లలో.. కిలోల కొద్ది బంగారం బయటపడింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తాజాగా విశాఖపట్టణానికి చెందిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శరగడం వెంకటరావు ఏసీబీకి చిక్కాడు. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో భాగంగా సోదాలు చేసిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. అతని పేరిట ఉన్న బ్యాంకు లాకర్లలో.. కిలోల కొద్ది బంగారం బయటపడింది. సాధారణంగా ఎవరి లాకర్లలో అయినా.. ఒకటో రెండో నగలు ఉంటాయి. ఇతని లాకర్లలో ఏకంగా బంగారం దుకాణమే ఉందని అధికారులు చెప్పడం గమనార్హం.

సోమవారం వెంకటరావుకు చెందిన బ్యాంకు లాకర్లలో సోదాలు చేపట్టారు. విశాఖ మురళీనగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 2లాకర్లు, ఊర్వశి ఎస్‌బీఐ బ్రాంచిలో ఒకటి, మర్రిపాలెం విశాఖ కోఆపరేటివ్‌ బ్యాంకులో ఒకటి, అక్కయ్యపాలెం గౌరీ కోఆపరేటివ్‌ బ్యాంకులో ఒకటి చొప్పున లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 3లాకర్లు తెరిచారు. 

ఒక్కో లాకర్‌లో కిలోలకొద్దీ బంగారం, వెండి వస్తువులు బయటపడటం చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలోని రెండు లాకర్లు కలిపి 1.8 కిలోల బంగారం వస్తువులు, ఎస్‌బీఐ లాకర్‌లో 1.3 కిలోల బంగారం, 10కిలోల వెండి వస్తువులు బయటపడ్డాయి. మంగళవారం మిగిలిన రెండు లాకర్లను తెరిచే అవకాశం ఉంది. ఇవి కాకుండా.. కరాసలో 400 గజాల ఖాళీ స్థలం, మరో రెండు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు కూడా ఈ లాకర్లలో లభ్యమయ్యాయి. ఈ సోదాల్లో మూడు కోట్ల విలువైన బంగారం వస్తువులు, వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

click me!