అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారుల మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది.
అమరావతి: ఏపీ సీఐడీ కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. శుక్రవారంనాడు ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్పించారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది.ఈ పిటిషన్ పై ఈ నెల 31న ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు నిన్ననే కౌంటర్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కు రెండు రోజుల ముందు నుండి ఏపీ సీఐడీ అధికారుల మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఏపీ సీఐడీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు బయటకు వస్తాయని చంద్రబాబు తరపు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
undefined
ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ఆదేశాల మేరకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా తమకు అనుమానాలున్నాయని బాబు లాయర్లు కోర్టులో వాదించారు. ఈ కారణంగానే తాము మొబైల్ డేటా అడుగుతున్నామన్నారు. చంద్రబాబు విచారణ సమయంలో కూడ ఫోటోలు, వీడియోలు కూడ బయటకు వచ్చిన విషయాన్ని బాబు లాయర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విచారణ చేసే అధికారుల మొబైల్ కాల్ డేటాను బయటకు ఇస్తే సీఐడీ అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు అవుతుందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. అయితే అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే మొబైల్ కాల్ డేటాను తాము అడగడం లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇవాళ సుమారు గంటకు పైగా ఇరు వర్గాల న్యాయవాదులు ఏసీబీ కోర్టులో తమ వాదనలు విన్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు జడ్జి ప్రకటించారు.
also read:సీఐడీ అధికారుల మొబైల్ డేటాపై బాబు పిటిషన్: సీఐడీ కౌంటర్ దాఖలు, విచారణ రేపటికి వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు . చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారుల మొబైల్ కాల్ డేటాను ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ సెప్టెంబర్ 11న దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను సవరించి ఇవ్వాలని ఏసీబీ కోర్టు చంద్రబాబు లాయర్లకు సూచించింది. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ ను సవరించి దాఖలు చేశారు.