స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు ఊరట .. జైలులో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ కోర్ట్ అనుమతి

Siva Kodati |  
Published : Oct 14, 2023, 08:43 PM ISTUpdated : Oct 14, 2023, 08:56 PM IST
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు ఊరట .. జైలులో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ కోర్ట్ అనుమతి

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఆయన వున్న బ్యారెక్‌లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం జైళ్ల శాఖను ఆదేశించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఆయన వున్న బ్యారెక్‌లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం జైళ్ల శాఖను ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా జైలులో ఏసీ ఏర్పాటు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు శనివారం ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వైద్యుల సూచనలు తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఆన్‌లైన్ ద్వారా విచారణ చేశారు న్యాయమూర్తి. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, గింజుపల్లి సుబ్బారావు ..సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి .. చంద్రబాబుకు టవర్ ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. 

అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పందించారు ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. శనివారం ఆయన వైద్యులతో కలిసి రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటలూ చంద్రబాబుకు జైలు సిబ్బంది అందుబాటులో వుంటున్నారని తెలిపారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని.. ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలుసునని రవికిరణ్ స్పష్టం చేశారు. 

ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నామని.. లోకేష్‌తో దురుసుగా వ్యవహరించలేదని, ములాఖత్ సమయం అయిపోయిందని గుర్తుచేశామన్నారు. చంద్రబాబు హై ప్రొఫైల్ ఖైదీ మాత్రమేనని.. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను ఆయన న్యాయవాదులే అడిగారని రవికిరణ్ వెల్లడించారు. మెడికల్ రిపోర్టు ఇవ్వాలని అని తాము చంద్రబాబును అడిగామని ఆయన చెప్పారు. చంద్రబాబు అనుమతితోనే రిపోర్టును ఆయన న్యాయవాదులకు ఇచ్చామని రవికిరణ్ పేర్కొన్నారు. డాక్టర్లు ఇచ్చిన నివేదికను యధాతథంగా చంద్రబాబు లాయర్లకు ఇచ్చామని డీఐజీ పేర్కొన్నారు. 

ALso Read: చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష.. నా తండ్రికి ఏమైనా జరిగితే జగన్ సర్కార్ దే బాధ్యత - నారా లోకేశ్‌

తాము ఎవరితోనైనా గౌరవంగానే వ్యవహరిస్తామని.. డెర్మటాలజిస్ట్ చంద్రబాబును పరీక్షించి కొన్ని రికమండేషన్స్ చేశారని రవికిరణ్ చెప్పారు. చంద్రబాబు కోసం అత్యుత్తమ డాక్టర్ల బృందం అందుబాటులో వుందని.. మా డాక్టర్లు ప్రతీరోజూ మూడుసార్లు చంద్రబాబును పరీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్‌ను ఫాలో అవుతున్నామని.. ఈ నివేదికను కోర్టుకు సమర్పిస్తామని డీఐజీ వెల్లడించారు. చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరని, ఆయన కోసం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని రవికిరణ్ తెలిపారు. జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని.. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామని డీఐజీ పేర్కొన్నారు. 

ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంగానే వున్నారని తెలిపారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. ఐదుగురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించిందని శివకుమార్ చెప్పారు. చంద్రబాబుతో తాను స్వయంగా మాట్లాడానని.. ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని శివకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ వుందని.. ఆయన వ్యక్తిగత వైద్యులను సంప్రదించి ట్రీట్‌మెంట్ ఇచ్చామని చెప్పారు.

రిమాండ్‌కు రాకముందు చంద్రబాబుకు ఎలాంటి వ్యాధులు వున్నాయో తమకు తెలియదని శివకుమార్ తెలిపారు. చంద్రబాబు వేసుకుంటున్న మందులను ఆయన మాకు చూపించారని శివకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబును చల్లని ప్రదేశంలో వుంచాలని శివకుమార్ చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu