ఏపీలోని గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బలోని రొయ్యల చెరువు వద్ద విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్తు షాక్ తగిలి ఆరుగురు మరణించారు. వారంతా రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నారు.
గుంటూరు: గుంటూరు జిల్లా లకంవానిదెబ్బలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రొయ్యల చెరువు వద్ద ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గదిలో కాలి బూడిదై కనిపించారు. వారంతా ఒడిశాకు చెందినవారని సమాచారం. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నారు.
విద్యుత్తు షాక్ తగిలి ఆరుగురు కూలీలు మరణించారు. వారంతా ఒకే గదిలో మృతి చెందారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున రొయ్యలకు మేత వేయడానికి వచ్చిన ఓ వ్యక్తి ఆ విషాదకమైన దృశ్యాన్ని చూసి యజమానికి సమాచారం ఇచ్చాడు.
విద్యుత్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన చోటుకు ఎవరినీ రానీయడం లేదు. అర కిలోమీటరు దూరంలోనే అందరినీ నిలిపేశారు. సంఘటనా స్థలంలో విద్యుత్తు తీగెలు పడి ఉన్నాయి. అక్కడ విద్యుత్తు సరఫరాను నిలిపేశారు.
ప్రమాదం జరిగిన రొయ్యల చెరువుకు సమీపంలోనే మరో రొయ్యల చెరువు ఉంది. అక్కడికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. మృతులను కిరణ్, మనోజ్, నవీన్, రామమూర్తి, పండబో, మహేంద్రలుగా గుర్తించారు. వారంతా చెరువు గట్టున షెడ్డులో పడుకుని ఉండగా ప్రమాదం జరిగింది.