
అమరావతి: 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) చేతికి ఎమ్మెల్యేల పనితీరు, గెలుపు అవకాశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు వైసిపి (ysrcp) ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా దాదాపు 50మంది వైసిపి ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత గుర్రుగా వున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో ప్రజలు తిరస్కరించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తేలడంతో దాదాపు 50మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు వైసిపి అధినేత సిద్దమయినట్లు సమాచారం.
వివిధ అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగ్గా లేకపోవడం, నియోజవర్గ ప్రజలకు అందుబాటులో వుండకపోవడం వంటి కారణాలతో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టింది. దీంతో ఇలాంటివారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయించుకున్నారట. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ బలోపేతానికి పాటుపడుతూ నిబద్దతగా వుండకపోవడం, ఏ క్షణానయినా పార్టీ మారే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టింది. దీంతో ఇలాంటివారిపై కూడా వేటుకు సీఎం జగన్ సిద్దపడినట్లు తెలుస్తోంది.
ఇలా తొలిసారి ఎన్నికైన దాదాపు 30మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని జగన్ కు రిపోర్ట్ అందిందట. వివిధ కారణాలతో వీరి గెలుపు అవకాశాలు కూడా సన్నగిల్లడంతో మరోసారి అవకాశం ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారట. అలాగే మరో 12 మంది సీనియర్ ఎమ్మెల్యే, ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు అసంతృప్తితో వున్నారట. ఇలా 150మంది వైసిపి ఎమ్మెల్యేల్లో 50మంది తిరిగి గెలిచే అవకాశాలు లేకపోవడంతో వారిపై వేటుకు పార్టీ అధినేత జగన్ సిద్దమయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైసిఎల్పీ సమావేశంలోనూ సీఎం జగన్ ఎమ్మెల్యేలతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికయినా పనితీరు మార్చుకుంటే తిరిగి అవకాశాలుంటాయని... లేదంటే వేటు తప్పదని హెచ్చరించనున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలిలో మార్పులు చేర్పులకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన కేబినెట్ బేటీలో మంత్రిమండలి మార్పు గురించి సీఎం జగన్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. తాజాగా వైసిఎల్పీతో సీఎం జగన్ ఇవాళ సమావేశమై కేబినెట్ మార్పులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దీంతో మంత్రుల్లో టెన్షన్ నెలకొనగా ఎమ్మెల్యేలలో ఉత్కంఠ పెరిగింది.
రెండున్నరేళ్ళ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు కేబినెట్ మార్పుపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతున్న కేబినెట్ నుండి ఎవరు వైదొలుగుతారు... కొత్తగా ఎవరికీ అవకాశం దక్కే అవకాశాలున్నాయో ఈ సమావేశం అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అయితే కేబినెట్ మార్పుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
గతంలో వైసిపి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సీఎం జగన్ రెండున్నరేళ్ళ తర్వాత మళ్లీ కేబినెట్ లో మార్పుచేర్పులు వుంటాయని ప్రకటించారు. మంత్రి పదవులు దక్కనివారు నిరాశపడవద్దని... తర్వాత అవకాశం వస్తుందని ఎమ్మెల్యేలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా కేబినెట్ మార్పులకు జగన్ సిద్దమయ్యారు. అయితే కొందరు సీనియర్ మంత్రులను కొనసాగిస్తూనే కొత్తవారికి అవకాశమివ్వాలని జగన్ చూస్తున్నారట. ఇదే విషయాన్ని ఇవాళ జరిగే వైసిఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు జగన్ తెలియజేయనున్నారు.