గోదారి ఉగ్రరూపం: ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న ప్రవాహం, వరద ముంపులో... 30 ఏజెన్సీ గ్రామాలు

Siva Kodati |  
Published : Sep 10, 2021, 10:08 PM IST
గోదారి ఉగ్రరూపం: ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న ప్రవాహం, వరద ముంపులో... 30 ఏజెన్సీ గ్రామాలు

సారాంశం

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదారమ్మ.. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం.. 12 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తేశారు. 10.20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో దేవీపట్నం మండలంలోని 30 ఏజెన్సీ గ్రామాలు.. వరద ముంపులోనే ఉన్నాయి.

గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు అవుట్ ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉంది. దీంతో విపత్తుల శాఖ కమిషనర్ కె . కన్నబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

అయితే దేవీపట్నం మండలంలోని 30 ఏజెన్సీ గ్రామాలు.. వరద ముంపులోనే ఉన్నాయి. కొండమొదలు పంచాయతీ పరిధిలోని 10  గ్రామాల గిరిజనులు.. నాటు పడవల సాయంతో కొండపైకి చేరుకుని, అక్కడే తలదాచుకుంటున్నారు. అలాగే కోనసీమలోని పలు లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో.. బయటి ప్రపంచంతో రాకపోకలు స్థంభించాయి. దీంతో అత్యవసర పనులకు ప్రజలు నాటుపడవలనే ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్