
పటమట లంక : ఆంధ్ర ప్రదేశ్ లోని పటమట లంకలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు తల్లితో గారాలు పోతూ, మారాము చేస్తూ.. స్నానం చేస్తూ ఆటలాడిన ఆ చిన్నారి…అంతలోనే మృత్యువు బారిన పడ్డాడు. మూడేళ్ల కొడుకుకి…ఇంటి ముందు స్నానం చేపించి.. తడి ఒంటితో ఇంట్లోకి తీసుకెళ్లడం ఎందుకని.. టవల్ తేవడానికి లోపలికి వెళ్ళింది ఆ తల్లి. టవల్ తీసుకుని వచ్చేసరికి ఆ చిన్నారి విగత జీవిగా కనిపించాడు. అది చూసిన తల్లిరోదనలు మిన్నంటాయి.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇంటి ముందు నిలబడ్డ ఆ చిన్నారి మీద ఓ లారీ వచ్చి బోల్తా పడింది. మామిడికాయల లారీ కావడంతో అవన్నీ బాలుడు మీద ఒక్కసారిగా పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం రాత్రి పటమట లంక పరిధిలో ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మృతి చెందిన చిన్నారి పేరు సంజయ్(3). తల్లిదండ్రులు వెలిగింటి శివయ్య, మల్లీశ్వరి. శివయ్య రోజు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
పల్నాడు జిల్లాలో ప్రోటోకాల్ వివాదం.. అధికారులపై మంత్రి విడదల రజని ఆగ్రహం..
శుక్రవారం రోజు రాత్రి మల్లీశ్వరి ఆరుబయట కుమారుడికి స్నానం చేయించింది. ఒళ్ళు తుడవడానికి టవల్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. అదే సమయంలో నూజివీడు నుంచి చిత్తూరు మామిడికాయల లోడుతో ఓ లారీ పెడుతోంది. రాత్రి 8.50ని.ల సమయంలో పైవంతెన నుంచి కిందికి దిగుతూ అదుపుతప్పింది. అలా తదుపుతప్పడంతో పటమట లంక వైపు స్క్రూ బ్రిడ్జి కింద ఉన్న ఇళ్ళ ముందు బోల్తా పడింది.
సరిగ్గా ఆ సమయంలోనే బాలుడు అక్కడ ఉన్నాడు. దీంతో లారీ కింద ఇరుక్కుపోయాడు. ప్రమాద ఘటన సమాచారం తెలియడంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ హరి బాబు, క్లీనరు లారీ కేబుల్ లో ఇరుక్కుపోగా వారిని బయటికి తీసి ఆసుపత్రికి పంపించారు. అప్పటికే కొడుకు కనబడడం లేదని ఆ తల్లి వెతుక్కుంటుంది. క్రేన్ సహాయంతో లారీని పక్కకు జరపగా చిన్నారి బయటపడ్డాడు. అప్పటికి చిన్నారి కొన ఊపిరితో అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సంజయ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తల్లి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు.