
2018 గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 1,14,000 మంది నిరుద్యోగులు పరీక్ష రాశారని.. నాలుగేళ్లుగా ఫలితాల కోసం వారు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే స్క్రీనింగ్ టెస్ట్ కి 50 మందికి పైగా అభ్యర్ధులు హాజరయ్యారని... కోవిడ్ తో పాటు న్యాయపరమైన కారణాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని గౌతం సవాంగ్ తెలిపారు.
గ్రూప్ 1 పోస్టులకు గాను 325 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని.. వీరిలో పది యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు వెళ్లిన వారు.. ఇద్దరు ఐపీఎస్‌లు, పది మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు వున్నారని సవాంగ్ పేర్కొన్నారు. అలాగే ఇంటర్వ్యూకి వచ్చిన వారిలో 156 మంది మహిళలు వున్నారని.. మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసి అభ్యర్ధులకి ఇంటర్వ్యూలు నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డీఎస్పీ పోస్టులు వున్నాయని.. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఫలితాలను ప్రకటిస్తున్నామని సవాంగ్ చెప్పారు.
ఎంపికైన అభ్యర్ధులు ఈ నెల 12వ తేదీ లోపు ఏపీపీఎస్సీ ముందు హాజరై హామీ పత్రం ఇవ్వాలని.. టాప్ 10లో ఏడుగురు మహిళలు వున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో రాణి సుష్మిత (పిఠాపురం)కు మొదటి ర్యాంకు.. శ్రీనివాసుల రాజు (కొత్తులగుట్ట, వైఎస్సార్ కడప జిల్లా)కు రెండవ ర్యాంక్, సంజనా సిన్హా (హైదరాబాద్)కు మూడవ ర్యాంక్ వచ్చిందని గౌతం సవాంగ్ వెల్లడించారు. వచ్చే నెల నుంచి వరుస నోటిఫికేషన్ లు ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.