పల్నాడు జిల్లాలోని మాచర్లలో మరో రెండు రోజులు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం మాచర్లలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
గుంటూరు: పల్నాడు జిల్లాలోని మాచర్లలో మరో రెండు రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.రెండురోజుల క్రితం మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవ ఉద్రిక్తంగా మారింది. వాహనాల దగ్దం ,ఇళ్లు, పార్టీ కార్యాలయాల ద్వంసం వరకు చేరుకుంది. అంతేకాదు రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. మాచర్లలో ఘర్షణలు జరిగిన తర్వాత పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. మాచర్లలో గొడవలకు వైసీపీ కారణమని టీడీపీ ఆరోపించింది. మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీగా జూలకంటి బ్రహ్మరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే గొడవలు తిరిగి ప్రారంభమయ్యాయని వైసీపీ ఆరోపించింది.
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ ను ఇంకా రెండు రోజుల పాటు కొనసాగించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీన మాచర్లలో ఘర్షణ జరిగిన తర్వాత 144 సెక్షన్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
మాచర్లలో జరిగిన ఘర్షణలపై టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 307, 143, 147, 148, 324 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాచర్లలో జరిగిన ఘర్షణలపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అంతేకాదు డీఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.అదనపు బలగాలను పంపినట్టుగా ఆయన తెలిపారు.మాచర్లలో జరిగిన ఘర్షణల విషయమై పల్నాడు ఎస్పీ రవిశంకర్ చేసిన ప్రకటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. మాచర్ల ఘటన పోలీస్ శాఖకు తలఒంపులు తెచ్చేలా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.