ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆ చిన్నారి.. తరువాత ఇంటి వెనకాల శవమై కనిపించింది. ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది.
14 ఏళ్ల బాలిక మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. బాలిక కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ ఇంట్లో ఉండే బాలిక బాబాయి తీరుపై అనుమానం స్థానిక యువకులకు అనుమానం వచ్చింది. ఆ ఇంటి వెనకాల గాలింపు చర్యలు చేపట్టడంతో బాలిక డెడ్ బాడీ కనిపించింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం పట్టణంలో ములుపు అంజి-దుర్గ దంపతులు 14 ఏళ్ల తమ కూతురు రత్నకుమారితో కలిసి ఓ ఇంట్లో జీవిస్తున్నారు. అయితే వీరి వెంట అంజి తమ్ముడు ములుపు మావుళ్లు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. ఆయన సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడి భార్య కువైట్ లో ఉన్నారు. ఇద్దరు పిల్లలు నరసాపురంలోని ఓ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు.
అంజి దంపతులు కూలి పనులు చేస్తూ కూతురిని స్థానికంగా ఉండే ఓ స్కూల్ లో చదివిస్తున్నారు. బాలిక ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. అయితే కొన్ని రోజులుగా బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో స్కూల్ కు వెళ్లడం లేదు. ఎప్పటిలాగే ఈ నెల 26వ తేదీన బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. కానీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన వారికి కూతురు కనిపించలేదు. స్థానికులను కూతురు గురించి అడిగి, చుట్టుపక్కల గాలించినా కనిపించలేదు. దీంతో వారు ఆందోళన చెంది వన్ టౌన్ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించారు. వారితో పాటు బాబాయి కూడా స్టేషన్ కు వెళ్లడంతో పాటు దిశ పోలీసులకు ఆయన ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు.
అయితే మావుళ్లు ప్రవర్తనలో వచ్చిన మార్పును స్థానిక యవకులు గమనించారు. అతడిపై నిఘా పెట్టారు. దీంతో కొంత మంది యువకులు, బాలిక తండ్రి అంజితో కలిసి ఇంటి వెనకాల ఉన్న తుప్పలవైపు వెతికేందుకు గురువారం ఉదయం ప్రయత్నించారు. కానీ దానిని మావుళ్లు అడ్డుకోవాలని చూశాడు. అటు వైపు ఎందుకు ఉంటుందని, అటు దిక్కు వెళ్లకూడదని చెప్పాడు. కానీ వారు వినిపించుకోలేదు. ఆ తుప్పల్లోకి వెళ్లి చూస్తే రత్నకుమారి డెడ్ బాడీ లభ్యం అయ్యింది.
ఆమెను సొంత బాబాయి హతమార్చి ఆ ప్రాంతంలో పడేసి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. ఘటనా స్థలాన్ని ఎస్పీ రవిప్రకాశ్ గురువారం పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించాలని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. కాగా.. బాలిక బాబాయి మావుళ్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై విచారణ జరుపుతున్నారు.