కడపలో ఘోరం... ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ లో 13మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

By Arun Kumar PFirst Published Jun 24, 2022, 11:54 AM IST
Highlights

వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు, ట్రాక్టర్ ఢీకొనడంతో 13 మంది ప్రయాణికులు గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. ఈ ఘోరం కడప జిల్లాలో చోటుచేసుకుంది. 

కడప : ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అతివేగంగా వెళుతూ ట్రాక్టర్ ను ఢీకొట్టిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులోకి ప్రయాణికులు, సిబ్బందితో పాటు ట్రాక్టర్ డ్రైవర్ గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులంతా కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 

కాజీపేట సమీపంలో జాతీయ రహదారిపై వెళుతున్న ట్రావెల్స్ బస్సుకు ఒక్కసారిగా ట్రాక్టర్ అడ్డువచ్చింది. అయితే బస్సు మంచివేగంలో వుండటంతో అదుపుచేయడం డ్రైవర్ కు సాధ్యపడలేదు. దీంతో బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నారు. ఈ యాక్సిడెంట్ లో బస్సులోని 13మందికి గాయాలయ్యాయి.   

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందినవెంటనే కాజీపేట పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే బస్సులోంచి బయటకు తీసి అంబులెన్సుల్లో కడప రిమ్స్ కు తరలించారు. అక్కడి చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా వుండగా మిగతావారి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం.ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలావుంటే గతవారం ఏలూరు జిల్లాలో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. దాదాపు 50మంది ప్రయాణికులతో నిండుగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన గల రెయిలింగ్ ను ఢీకొని బోల్తాపడింది. సరిగ్గా ఓ నీటికాలువ పక్కనే బస్సు బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ రెయిలింగ్ ను ఢీకొన్న తర్వాత బస్సు నీటికాలువలో దూసుకెళ్ళివుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా వుండేది.  

శ్రీకాకుళం నుండి విజయవాడకు దాదాపు 50మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. అయితే ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను సమీపంలో ఈ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతున్న బస్సు రోడ్డుపక్కన రక్షణకోసం ఏర్పాటుచేసిన రెయిలింగ్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. 

ట్రావెల్స్ బస్సు సరిగ్గా ఓ నీటికాలువ అంచువరకు వెళ్లి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు   గాయపడ్డారు. మిగతావారు చిన్నచిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్స్ లో క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ బస్ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

గతవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడటంతో పొట్టకూటికోసం ఏపీకి వలసవస్తున్న ఒడిశాకు చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

 

click me!