ఏలూరులో ఘోరం... నడిరోడ్డుపైనే బైక్ తో సహా యువ సోదరుల సజీవదహనం

By Arun Kumar PFirst Published Jun 24, 2022, 9:44 AM IST
Highlights

విద్యుత్ షాక్ కు గురయి నడిరోడ్డుపై ఇద్దరు సోదరులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుుకుంది. బైక్ తో సహా సోదరులిద్దరు సజీవదహనం అయ్యారు. 

ఏలూరు : ఇద్దరు అన్నదమ్ములు విద్యుత్ షాక్ గురయి దుర్మరణం చెందిన విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరి మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, ఫణీంద్ర సోదరులు. పెద్దవాడు బిటెక్, చిన్నవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఇద్దరు పిల్లలను చదవించుకుంటున్నారు. ఇలా ఆ కుటుంబం ఆనందంగా జీవించేది.  

అయితే తండ్రికి అనారోగ్యంగా వుండటంతో నాగేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ ఇవాళ తెల్లవారుజామున పాలు పితకడానికి పొలానికి వెళుతుండగా ఘోరం జరిగింది. రాత్రి ఎప్పుడో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి పుంత రహదారిపై పడ్డాయి. గ్రామస్తులు కానీ విద్యుత్ శాఖ అధికారులు గానీ ఇది గమనించలేదు. దీంతో అన్నదమ్ములు బైక్ వెళుతుండగా విద్యుత్ సరఫరా అవుతున్న ఈ తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా బైక్ కు మంటలు అంటుకుని రెప్పపాటులో సోదరులిద్దరికి అంటుకున్నారు. దీంతో ఇద్దరు యువకులు సజీవదహనమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు.   

ఇలా ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందడంతో ఆ కుటుంబంలోనే కాదు దేవులపల్లిలో విషాదం అలుముకుంది. నాగేంద్ర, ఫణీంద్ర ల మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.  రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఇదిలావుంటే నిన్న(గురువారం) విజయవాడలో నిత్యం రద్దీగా వుండే, వీఐపిలు తిరిగే కనకదుర్గ ఫ్లైఓవర్‌ వద్ద ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ప్లైఓవర్ కింద చెలరేగిన మంటల అలజడి సృష్టించాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలతోపాటు పేలుడు శబ్దం రావడంతో జనం పరుగులు తీశారు. ఎప్పుడూ రద్దీగా వుండే ఈ మార్గంలో మంటలు రావడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. దీంతో రైల్వే సిబ్బంది, అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. 

ఫ్లైఓవర్‌ కింద ఇంటర్నెట్‌ కేబుళ్లకు సంబంధించిన పనులు చేస్తుండగా రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలు తగలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్నెట్‌ కేబుళ్లు లాగిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాజీ కలగలేదు. 

click me!