ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కీలక పరిణామం: సీఈవో సహా 12 మంది అరెస్ట్

By Siva KodatiFirst Published Jul 7, 2020, 8:12 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఎల్జీ పాలిమర్స్ సీఈవో, కంపెనీ డైరెక్టర్లు ఉన్నారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఎల్జీ పాలిమర్స్ సీఈవో, కంపెనీ డైరెక్టర్లు ఉన్నారు.

ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రమాదానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి జగన్‌కు హైపవర్ కమిటీ నివేదిక అందజేసింది. ఎవరెవరి నిర్లక్ష్యం వుంది అన్న దానిపై నివేదికలో వివరాలను పొందుపరిచారు. 

ఎల్జీ పాలీమర్స్ ప్రమాదానికి పలు లోపాలను హై పవర్ కమిటి ఎత్తిచూపింది. నాలుగు వేల పేజీలతో హై పవర్ కమిటి నివేదికను ఏపీ సీఎం జగన్ కు సోమవారం నాడు అందించింది.

మే 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పలు కమిటిలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానమైంది హైపవర్ కమిటి.

ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకేజీకి పలు అంశాలపై హైపవర్ కమిటి ఎత్తి చూపింది. ఈ ప్రమాదానికి ఫ్యాక్టరీలో పలు లోపాలను కమిటి నివేదిక అభిప్రాయపడింది.విశాఖ పట్టణం నుండి ఈ ఫ్యాక్టరీని తరలించాలని కూడ కమిటి సూచించింది. మరో వైపు లాక్ డౌన్ నిబంధనలను కూడ కంపెనీ పాటించలేదని కమిటి ఎత్తిచూపింది.

అత్యవసర సమయంలోనూ అలారం సిస్టమ్ ను ఉపయోగించలేదని కమిటి తేల్చి చెప్పింది. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించలేదని  కమిటి అభిప్రాయపడింది. కనీసం గేటు వద్ద అలారం కూడ మోగలేదని కమిటి గుర్తించింది. కనీసం ఈ అలారం మోగినా కూడ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది కాదని కమిటి అభిప్రాయంతో ఉంది.

ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు భద్రతా ప్రమాణాలపై అవగాహన లేదని కమిటి తేల్చింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరులో ఉద్యోగులు స్పందించలేదని కమిటి అభిప్రాయపడింది.

రిఫ్రిజరేషన్ కూలింగ్ సిస్టమ్ లో లోపాలు ఉన్నట్టుగా కమిటి గుర్తించింది. అత్యవసర ప్రమాదాల సమయంలో స్పందించడంలో కంపెనీ యాజమాన్యాలు స్పందించలేదని కమిటి నివేదిక తేల్చింది.

ఎం6 ట్యాంకులో ఉన్న స్టైరిన్ లిక్విడ్ లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదం సంబవించిందని కమిటి నివేదిక స్పష్టం చేసింది. ప్రమాద తీవ్రత తగ్గించే రసాయనాలు కూడ తగిన స్థాయిలో లేవని కూడ కమిటి అభిప్రాయపడింది.

click me!