అనంతపురం: ఆక్సిజన్ అందక పది మంది కరోనా రోగులు మృతి

By Siva KodatiFirst Published May 1, 2021, 8:52 PM IST
Highlights

ప్రభుత్వం ఎన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నా దేశంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందడం లేదు. నిత్యం ఏదో ఒక మూలన ఆక్సిజన్ కొరతతో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం ఉదయం నుంచి ఆక్సిజన్ అందక దాదాపు 10 మంది కరోనా రోగులు మరణించారు

ప్రభుత్వం ఎన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నా దేశంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందడం లేదు. నిత్యం ఏదో ఒక మూలన ఆక్సిజన్ కొరతతో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు.

తాజాగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం ఉదయం నుంచి ఆక్సిజన్ అందక దాదాపు 10 మంది కరోనా రోగులు మరణించారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం కారణంగా రోగులకు ప్రాణవాయువు అందలేదని అధికారులు చెబుతున్నారు.

అంతకుముందు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ ఆసుపత్రి యాజమాన్యం కరోనా చికిత్సను చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన నేపథ్యంలో యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆసుపత్రిని వదిలి పారిపోయారు. 

Also Read:కర్నూలు: ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి.. పారిపోయిన వైద్యులు, సిబ్బంది

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,412 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఇప్పటి వరకు ఏపీలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 11,21,102కి చేరింది. నిన్న ఒక్కరోజు కరోనా వల్ల రాష్ట్రవ్యాప్తంగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 8,053కి చేరుకుంది
 

click me!