ఏడాదిలో రూ. 2 లక్షల కోట్లు వెనక్కి: జగన్ పై బాబు విమర్శలు

By narsimha lodeFirst Published Jun 30, 2020, 3:48 PM IST
Highlights

ఏడాది పాలనలో రూ2లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం నుండి తరిమివేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 


అమరావతి:ఏడాది పాలనలో రూ2లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం నుండి తరిమివేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

 తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు, సీనియర్ నాయకులతో  చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. 

గత 5వారాల్లో ఏపిలో కరోనా కేసులు 400% పెరగడం ఆందోళనకరం. ఆసుపత్రులలో వసతులు లేవు, సరైన బెడ్స్ లేవు, వెంటిలేటర్లు లేవు. పొరుగు రాష్ట్రాలతో, జాతీయ సగటుతో పోలిస్తే రికవరీ రేటు తక్కువగా ఉందన్నారు. కోట్లాది మందికి వైరస్ పరీక్షలు చేసినట్లు పరీక్షల్లో దేశంలోనే ముందున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పటికీ ఏపిలో డాక్టర్లకు పిపిఈ కిట్లు అందకపోవడం దారుణం. పిపిఈల కోసం విశాఖ ఇఎన్ టి ఆసుపత్రిలో డాక్టర్ల ధర్నా నిర్వహించడం సిగ్గుచేటన్నారు.
 మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ రావును సస్పెండ్ చేశారన్నారు.

ఎంఎస్ ఎంఈలపై తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను వైసిపి గందరగోళం చేస్తోంది. చేతగాని వాళ్లే గతంపై నిందలు వేసి తమ అసమర్ధతను కప్పిపెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. టిడిపి ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలు రూ3,800కోట్లు చెల్లించిందన్నారు. 

పాత బకాయిలు చెల్లించడం ప్రతి ప్రభుత్వం బాధ్యత. అలాంటిది టిడిపి హయాంలో బకాయిలు తామే చెల్లించామని గొప్పలు చెప్పుకోవడం గర్హనీయమని చెప్పారు.
ఎంఎస్ ఈలకు ఇచ్చిన భూములను వెనక్కి లాక్కుంటూ ఎంఎస్ ఎంఈలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పడం హేయమన్నారు.

టిడిపి తెచ్చిన అపోలో టైర్స్ కంపెనీ, కియా కార్ల ఫ్యాక్టరీ తామే తెచ్చినట్లు చెప్పుకోవడం ప్రజల్లో నవ్వుల పాలైంది. .‘‘గవర్నమెంట్ టెర్రరిజం తెచ్చారు, బీహార్ ఆఫ్ సౌత్ గా ఏపిని మార్చారని’’ పారిశ్రామిక వేత్తల వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

 ఏ1, ఏ2 లు కూడబలుక్కుని రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. సొంత కంపెనీల కోసం ఏ1, వియ్యంకుడి కంపెనీల కోసం ఏ2 చేస్తున్న స్కామ్ లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.  

రూ1,300కోట్ల విలువైన సున్నపు రాయి గనులను, రైతులకు చెందాల్సిన నీళ్లను సీఎం కంపెనీ సరస్వతీ పవర్ కు కేటాయించుకున్నారు. 25ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములు లేవని కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. 

ఇళ్ల స్థలాల కోసం భూసేకరణకు చేస్తున్న రూ8వేల కోట్లలో రూ5వేల కోట్లు స్వాహా చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎకరం రూ 5లక్షలు చేయని భూములను 5-10రెట్లు అధిక ధరలకు ప్రభుత్వంతో కొనుగోళ్లు చేయించి వాటాలు వేసి పంచుకుంటున్నారని ఆరోపించారు.

అసెంబ్లీలో వైసిపి అవినీతిని నిగ్గదీశారనే అక్కసుతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్పపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారు. కౌన్సిల్ లో బీదా రవిచంద్ర యాదవ్ పై, టిడిపి ఎమ్మెల్సీలపై దాడి చేసిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.

సొంత బాబాయి హత్య కేసు నిందితులను 13నెలలైనా అరెస్ట్ చేయలేదు. ఇక్కడి దర్యాప్తుపై నమ్మకం లేదని, సిబిఐ విచారణ కావాలని చెల్లి కోరడమే అన్న పాలనకు అద్దం పడుతోందన్నారు. 

ప్రకాశం జిల్లాలోనే మైనింగ్ పై రూ2వేల కోట్ల జరిమానాలు విధించారు. మైనింగ్ లీజులు రద్దు, జరిమానాలు విధిస్తున్నారు, పర్మిట్లు రద్దు చేస్తున్నారు. సరెండర్ కాగానే పర్మిట్లు పునరుద్దరిస్తున్నారని ఆయన చెప్పారు.

గురజాలలో దళిత యువకుడు విక్రమ్ హత్య అమానుషం. హైదరాబాద్ లో ఉన్నవాడిని అంబాపురం పిలిపించి, ప్రతిరోజూ అర్ధరాత్రిదాకా స్టేషన్ లో ఉంచి అతనెప్పుడు వచ్చేది, పంపేది ప్రత్యర్ధులకు పోలీసు అధికారే సమాచారం ఇవ్వడం గర్హనీయమన్నారు. విక్రమ్ హత్యకు సీఎం జగన్ బాధ్యత వహించాలి. అక్కడి  సిఐని సస్పెండ్ చేయాలి. గురజాల ఎమ్మెల్యేపై హత్యానేరం నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాపులకు టిడిపి ఇచ్చిన 5% రిజర్వేషన్లకు తూట్లు పొడిచారు. టిడిపి గతంలో చేసిన ఎస్సీ కేటగిరైజేషన్ నీరుగార్చారు. బిసిల రిజ్వేషన్లు 34%నుంచి 24%కు కోత పెట్టారు. ఎస్టీలకు టిడిపి ఇచ్చిన 100% ఉద్యోగాలను లేకుండా చేశారని బాబు మండిపడ్డారు.

రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళనలు 200రోజులు అవుతున్న సందర్భంగా జులై 4న  నిరసనలు తెలపాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.. రైతులు, మహిళలు, రైతుకూలీలకు మద్దతుగా నిలబడాలన్నారు.
 

click me!