Rohit Sharma: 'ఒక్కేఒక్కడు'.. కపిల్ దార్శనికత.. గంగూలీ దూకుడు.. ధోనీ సహనం.. 

By Rajesh KarampooriFirst Published Nov 16, 2023, 4:35 PM IST
Highlights

ICC World Cup 2023: ప్రతిష్ఠాత్మక ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత జట్టు అజేయంగా జైత్రయాత్ర కొనసాగించడంలో ఓ ఆటగాడు కీలక పోషిస్తున్నాడు. ఆ ఆటగాడు ఎవరు? ఇంతకీ ఆ ఒక్కేఒక్కడు ఎవరు?

ICC World Cup 2023: కోట్లాది భారతీయుల ఆశలను పదిలంగా  మోసుకుంటూ ప్రతిష్ఠాత్మక ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్‌ పోరులో రోహిత్ సేన 70 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. తుదిపోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదిక కానున్నది.  

భారత్ జైత్రయాత్ర

ప్రతిష్టాత్మక ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2023లో  జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఫైనల్స్ వరకు సాగిన ప్రయాణంలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో టీమిండియా అజేయంగా నిలిచి వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లి కాగా, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు మహమ్మద్ షమీ నిలిచారు.  అలాగే.. శ్రేయాస్ అయ్యర్ కూడా రెండు వరుస సెంచరీలు చేసి మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇక కెఎల్ రాహుల్ కష్ట సమయంలో నేనున్నంటూ అదుకుంటున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తున్నారు. 

ఇలా టీమిండియా అద్భుతమైన ప్రయాణం సాగించడంలో ఓ ఆటగాడు కీలక పోషిస్తున్నాడు. అతడే.. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). హిట్ మ్యాచ్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ తోనూ ఆకట్టుకుంటూ.. అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ మెగా టోర్నీ ప్రారంభం నుంచి భారత్‌కు ఓపెనర్ రోహిత్ శుభారంభం అందించాడు. తన బ్యాటింగ్ విధ్వంసంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. తొలి 10 ఓవర్లలో జట్టు రన్ రేట్ అమాంతం పెంచేసేవాడు. దీంతో త్వరత క్రీజులోకి వచ్చిన ఇతర బ్యాట్స్‌మెన్‌లపై పెద్దగా ఒత్తిడి ఉండేది కాదు. ఆ బ్యాట్స్ మెన్స్ కూడా అదే రన్ రేట్ ను కొనసాగిస్తూ.. భారీ స్కోర్లు చేయడంలో విజయవంతమయ్యే వారు.

 రోహిత్ కెప్టెన్సీ అదుర్స్ 

రోహిత్ శర్మ కెప్టెన్సీలో కపిల్ దేవ్ దార్శనికత, సౌరవ్ గంగూలీ దూకుడు, మహేంద్ర సింగ్ ధోనీ సహనం ఉన్నాయని చెప్పడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోహిత్ కంటే ముందు భారత జట్టు కపిల్, గంగూలీ, ధోనీల నాయకత్వంలోనే ప్రపంచకప్ ఫైనల్ చేరగలిగింది. కపిల్ (1983), ధోనీ (2011) లు భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు. కానీ 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై గంగూలీ సేన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

గతేడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా  టీ20 ప్రపంచకప్ 2022 సెమీ-ఫైనల్‌ వరకు వెళ్లి.. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో రోహిత్ చాలా నిరాశ చెందాడు. ఐసీసీ టోర్నీల్లో విజయం సాధించాలంటే జట్టు తనకు అనుగుణంగా మార్చుకోవాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి కపిల్ దేవ్ దార్శనికత.. రోహిత్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 1983లో కపిల్‌ నాయకత్వంలో భారత జట్టు వెస్టిండీస్‌ గెలిచి ప్రపంచకప్‌ ను అందుకుంది. ఆ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను కనీసం పోటీదారుగా కూడా ఎవరూ భావించలేదు.  అలాంటి పరిస్థితుల్లో కపిల్ సేన విజయం సాధించింది.
 
ఇక గంగూలీ కూడా కెప్టెన్ అయ్యాక జట్టు వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాడు.  అతని సారథ్యంలోని భారత జట్టు కూడా విదేశీ గడ్డపై ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ గెలిచిన తర్వాత లార్డ్స్‌లో గంగూలీ చూపిన 'దూకుడు'అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ అయినా, సెమీఫైనల్‌ అయినా సరే.. రోహిత్‌ తన దూకుడును కొనసాగిస్తున్నారు. 

మాజీ కెప్టెన్ ధోనీలాగా రోహిత్ శర్మ కూడా సహనంగా వ్యవహరిస్తున్నారు. తాను కూడా కూల్ అంటూ.. పలు సందర్బాల్లో నిరూపించుకున్నాడు. తన తోటి ఆటగాళ్లపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సెమీస్‌లో కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. బుమ్రా వేసిన ఓవర్ లో కివీస్‌ కెప్టెన్ బంతికి గాలిలోకి లేపాడు. ఆ బంతి నేరుగా షమీ చేతుల్లోకి వచ్చింది. కానీ ఆ క్యాచ్‌ను షమీ జారవిడుచుకోవడంతో అభిమానులతో పాటు రోహిత్‌ కూడా నిరాశకు గురయ్యాడు. అయినా సహనం కోల్పోని భారత కెప్టెన్ కాసేపటి తర్వాత షమీకి బౌలింగ్ అప్పగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ నమ్మకమే షమీ చరిత్ర స్రుష్టించడానికి కారణమైంది. ఈ మెగా టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న రోహిత్ సేన ఖచ్చితంగా టైటిల్ గెలుచుకుంటుందని టీమిండియా ఫ్యాన్స్  భావిస్తున్నారు. ఈ టోర్నీలో ప్రపంచ విజేతగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.. 

click me!