"నా ఇన్‌స్పిరేషన్ అదే.." కోహ్లీ గురించి ఆసక్తికర విషయం చెప్పిన గిల్!

By Rajesh KarampooriFirst Published Nov 16, 2023, 3:04 PM IST
Highlights

Shubman Gill: కింగ్ కోహ్లీ 50 సెంచరీలు పూర్తి చేసి.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా నిలిచారు. యావత్తు క్రీడా ప్రపంచానే తనవైపుకు తిప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీతో కలిసి ఆడటంపై గిల్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Shubman Gill: కోట్లాది భారతీయుల ఆశలను టీమిండియా పదిలంగా  మోసుకుంటూ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్‌ పోరులో రోహిత్ సేన 70 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఈ మ్యాచ్ లో కివీస్‌ బౌలర్లను చీల్చిచెండాడుతూ విరాట్ కోహ్లీ.. సచిన్‌ టెండూల్కర్‌ (49) సెంచరీల రికార్డును అధిగమిస్తూ వాంఖడేలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 50వ సెంచరీ పూర్తి చేసి.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా నిలిచారు. అదే సమయంలో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (711) చేసిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ తరుణంలో పలువురు కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. 

తాజాగా కింగ్ కోహ్లీ పై టీమిండియా యంగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్స్ సుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మ్యాచ్ అనంతరం గిల్ విలేకరులతో మాట్లాడుతూ.. 'స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్  కోహ్లీ మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి సాధిస్తాడని ప్రశంసించారు. కోహ్లి రికార్డులు బద్దలు కొట్టే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పుడు తాను డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని అతనినే చూస్తున్నానన్నారు. గత 10-15 సంవత్సరాలుగా నిలకడగా రాణించడమంటే మాటలు కాదనీ,  ఇది నిజంగా స్ఫూర్తిదాయకమని అన్నారు.  విరాట్ కోహ్లి పరుగుల వేట,అంకితభావం తనకు చాలా ఇష్టమనీ, తన ఆటతో తాను స్ఫూర్తి పొందానని అన్నారు. కోహ్లీకి, తన బ్యాటింగ్‌కు కొంత పోలిక ఉందని, ఎందుకంటే తామిద్దరం స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించడానికి చాలా ఇష్టపడుతామని గిల్ అన్నాడు. 'నిజం చెప్పాలంటే.. తామిద్దరం క్రీజులో  పరిస్థితి, ఆటను ఎలా కొనసాగించాలనే దాని గురించి మాట్లాడుకుంటామని గిల్ చెప్పుకొచ్చాడు. గిల్ ఎప్పుడూ తన ఐడల్ కోహ్లీ అని చెప్తూనే ఉన్నాడు. 

రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. తాను కొత్త విషయాన్ని నేర్చుకుంటానని కూడా గిల్ చెప్పాడు. అతనికి సంబంధించిన ప్రతి ఒక్కటీ తనని  బాగా ఆకట్టుకుంటాయనీ, పవర్ ప్లేలో తాను రోహిత్ కు స్టూడెంట్‌గా ఉంటానని అన్నారు. రోహిత్ 10 ఓవర్లు ఆడితే.. తాను 15 నుండి 20 బంతులు ఆడతానని అన్నారు.  రోహిత్ రాగానే తన పని మొదలు పెట్టాడతాడనీ,  ఫోర్లు,సిక్సర్లు కొట్టుతూ ఉంటే.. వాటిని అలా చూస్తూ ఉండిపోతానని అన్నారు. భారత ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమని గిల్ అంగీకరించాడు. 57 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీని సెమీఫైనల్లో ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారని తెలిపారు.  నిజంగా షమీని ఎదుర్కోవడం చాలా కష్టమనీ, నెట్స్‌లో కూడా అతడిని ఎదుర్కోవడం అంత సులువు కాదనీ అన్నారు.  కానీ షమీతో ఆడటం సరదాగా ఉంటుందని తెలిపారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ కూడా తనకు బౌలింగ్ చేయడానికి ఇష్టపడుతారని, వాళ్ల బౌలింగ్ దాడిని ఎదుర్కొవడం చాలా పెద్ద సవాలేనని అన్నారు. 

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచులో కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే తన వ్యక్తిగత స్కోర్ 79 పరుగుల వద్ద కాలి గాయంతో రిటైర్డ్ హర్ట్ అయి.. ఫేవిలియన్ బాట పట్టాడు. చివరి ఓవర్ లో తిరిగొచ్చి 80 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. 

click me!