
IND vs AUS ICC World Cup 2023: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. టైటిల్ కోసం ఒక్క అడుగు దూరంలో ఇరు జట్టు నిలిచాయి. భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్‌లో తలపడేందుకు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు ఒకరి బలహీనతలు, లోపాలను మరొకరు దృష్టిలో పెట్టుకుని ఫైనల్ పోరుకు సన్నద్దమవుతున్నారు. ఇలాంటి హైవోల్టేజ్ మ్యాచ్ ప్రతికూల వాతావరణం, టై లేక మరేదైనా పరిస్థితులు తలెత్తినా మ్యాచ్ జరగకపోతే వరల్డ్ కప్ విజేత ఎవరంటూ? ఫైనల్ మ్యాచ్ కు ముందు క్రికెట్ ప్రేమికుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆదివారం (నవంబర్ 19) జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై వర్షం లేదా మరే ఇతర వాతావరణ ప్రభావం ఉండే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి ముందు అందరూ నిస్సహాయులమే.. ఒక వేళ వర్షం అడ్డంకిగా మారినా లేదా ఇతర ప్రతికూల పరిస్థితులు తలెత్తినా ఈ మ్యాచ్ రిజర్వ్ రోజున జరుగుతుంది. ఒక వేళ రిజర్వ్ డే న కూడా మ్యాచ్ జరగకపోతే.. 2023 ప్రపంచ కప్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్టు ఉమ్మడి విజేతలుగా ప్రకటించబడుతుంది.
ఫైనల్‌లో మ్యాచ్ టై అయితే..
ఒక వేళ వరల్డ్ కప్ ఫైనల్‌లో మ్యాచ్ టై అయితే.. విజేత నిర్ణయించే వరకు సూపర్ ఓవర్ కొనసాగుతుంది. సూపర్ ఓవర్‌లో రెండు జట్ల మధ్య ఒక్కో ఓవర్ మ్యాచ్ జరుగుతుందని, అలాంటి పరిస్థితుల్లో సూపర్ ఓవర్‌లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మరో సూపర్ ఓవర్ ఉంటుంది. ఏదోక జట్టు విజేత అయ్యే వరకు ఇది జరగవచ్చు.
ఈసారి బౌండరీ కౌంట్ రూల్ అమలు కానుందా?
ఈసారి బౌండరీ కౌంట్ రూల్ అమలు కానుందా? అనే ఉత్సుకత క్రికెట్ ప్రేమికుల మదిలో ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవానికి 2019 ప్రపంచకప్‌లో బౌండరీ కౌంట్ రూల్ ప్రకారమే.. ఛాంపియన్ జట్టును నిర్ణయించారు. 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఆతిథ్య జట్టు మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. దీని తర్వాత, సూపర్ ఓవర్ కూడా టై అయింది.
ఆ తర్వాత బౌండరీ కౌంట్‌లో అత్యధిక ఫోర్లు మరియు సిక్సర్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటించారు. దీని ఆధారంగా తొలిసారి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ టై అయినప్పుడు కూడా ఇదే తరహా మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత బాల్ అవుట్ రూల్ ఆధారంగా విజేత జట్టును నిర్ణయించారు. అయితే వివాదం తర్వాత ఐసీసీ ఈ నిబంధనలను రద్దు చేసింది.