ICC World Cup 2023: ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా.. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరంటే..?

By Rajesh KarampooriFirst Published Nov 18, 2023, 10:56 PM IST
Highlights

ICC World Cup 2023: క్రికెట్ వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ తుది దశకు చేరుకుంది. నవంబర్ 19 (ఆదివారం) న  ఫైనల్ పోరులో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని ప్రకటించారు. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరంటే.. ?  

ICC World Cup 2023: క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ పోరు ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా మధ్య టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం దేశ, ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ జ్యోతిష్య యాప్ ఆస్ట్రోటాక్ వ్యవస్థాపకుడు, సీఈవో పునీత్ గుప్తా (Astrotalk Ceo Puneet Gupta ) తన వినియోగదారులకు ప్రత్యేక అవార్డును ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించినట్లయితే.. ఆస్ట్రోటాక్ తన కస్టమర్లకు రూ.100 కోట్లను పంచుతుంది. ఈ మొత్తం వినియోగదారులందరికీ సమానంగా పంపిణీ చేయబడుతుందని ప్రకటించారు. 

జ్యోతిష్య యాప్ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా  తన లింక్డ్‌ ఇన్ పోస్ట్‌లో ఇలా వ్రాశాడు. 'టీమిండియా చివరిసారి 2011లో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. నేను ఆ సమయంలో కళాశాలలో చదువుకుంటున్నాను. ఆ రోజు నా జీవితంలో మరపురాని రోజులలో ఒకటి. చండీగఢ్‌లోని సమీపంలోని కళాశాల ఆడిటోరియంలో నా స్నేహితులతో కలిసి ఆ మ్యాచ్‌ని చూశాను. మేము రోజంతా ఒత్తిడితో ఉన్నాము. మ్యాచ్ ముందు రోజు నిద్ర పట్టక, ఆ ​​రాత్రంతా మ్యాచ్ వ్యూహం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ మ్యాచ్ గెలిచిన వెంటనే నాకు చాలా సేపు గూస్‌బంప్స్‌ వచ్చాయి. నేను నా స్నేహితులను కౌగిలించుకున్నాను. ఆ తరువాత నా ఫ్రెండ్స్ నేను బైక్‌లపై చండీగఢ్ చుట్టూ తిరిగాము. మా దారిలో ఎవరు కనిపించిన వారిని ఆలింగనం చేసుకున్నాం. అయితే, ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. అని రాసుకొచ్చారు. 

సీఈవో పునీత్ గుప్తా  ఇంకా ఇలా వ్రాశాడు. 'ఈసారి మనం ఏమి చేయగలమో నిన్న రాత్రి బాగా ఆలోచించాను. చివరిసారి నేను నా ఆనందాన్ని పంచుకోగలిగే కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. కానీ, నేడు చాలా మంది AstroTalk వినియోగదారులు నా వెంటనే ఉన్నారు. వాళ్లంతా నా స్నేహితుల లాంటి వారు. కాబట్టి, వారితో నా సంతోషాన్ని పంచుకోవడానికి ఏదైనా చేయాలి. కాబట్టి.. ఈ ఉదయం నేను నా ఫైనాన్స్ టీమ్‌తో దాని గురించి మాట్లాడాను. భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లను మా వినియోగదారుల వాలెట్లలో పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం. టీమిండియా కోసం ప్రార్థిద్దాం.. రోహిత్ సేనకు మద్దతు ఇద్దాం.. భారత జట్టును ఉత్సాహపరుస్తాం.. అని పేర్కొన్నారు.

భారత్‌ నాలుగోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకోగా, ఆస్ట్రేలియా ఎనిమిదోసారి టైటిల్‌ మ్యాచ్‌కు చేరుకుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించగా, దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా ఓడించింది. కాగా.. 1987, 1999, 2003, 2007, 2015లో ఆస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకోగా,  భారత్ 1983, 2011లో టైటిల్ ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇందులో 130,000 మంది ప్రేక్షకులకు సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. 20 ఏళ్ల ప్రతీకార మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో? ఏ జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే. 

click me!