ఏపి శాసనమండలిలో గందరగోళం... తెలంగాణ మండలికీ గండం: మాజీ మంత్రి దాడి

By Arun Kumar PFirst Published Jan 21, 2020, 6:29 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు, మండలి ఛైర్మన్ అడ్డుకోడాన్ని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తప్పుబట్టారు. 

విశాఖపట్నం: పాలన వికేంద్రీకరణకు ఎందుకు అవసరమో కారణాలతో సహా సిఎం జగన్ ఒక ఎకడమీషియన్ లా వివరించారని వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రశంసించారు. శాసనమండలిలో శాసనసభ ఆమోదించిన బిల్లులను అనుమతించకపోవటం ఆశ్చర్యకరమన్నారు. శాసనమండలికి 14 మంది మంత్రులు వచ్చారని లోకేష్ అనటం విడ్డూరంగా వుందన్నారు. గతంలో 30 మంది మంత్రులు వచ్చింది గుర్తులేదా అని ప్రశ్నించారు. 

రూల్71  చర్చ అనుమతిస్తానని చైర్మన్ అంటున్నారని... ఇది కేవలం బిల్లును అడ్డుకం కోసమే చేస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య పద్దతి కాదంటూ టిడిపి సభ్యులపై దాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ కు ఒక బిల్లును ఎడ్మిట్ చేయకుండా ఆపే విచక్షణాధికారం లేదన్నారు.

బిల్లు మెరిట్స్ చూడటానికి మీరు ఎవరు? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత మండలి చైర్మన్ ప్రజాస్వామ్యవాదేనని... కానీ పార్టీ అధినేత చంద్రబాబు ప్రోద్బలం, ఒత్తిడితో ఇలా చేస్తున్నారని  ఆరోపించారు. రాజ్యాంగ ప్రతిష్ఠంభనకు ప్రయత్నిస్తూ ఘర్షణ సృష్టించడం ద్వారా చంద్రబాబు లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. 

read more  అదో విప్లవాత్మక పథకం...ఆ పేరే ఎందుకు పెట్టామంటే: మంత్రి కన్నబాబు

మిగతా ఎమ్మెల్సీలంతా బిల్లు ప్రవేశపెట్టాలంటున్నా టిడిపి ఒక్కటే వ్యతిరేకిస్తోందని అన్నారు. మొదట చర్చ ప్రారంభించి ఆ తర్వాత సవరణలు ప్రతిపాదిద్దామంటున్నారని... అందుకు కూడా టిడిపి నాయకులు అంగీకరించకపోవడం విచిత్రంగా వుందన్నారు. ముఖ్యంగా చైర్మన్ సభ్యుల మాటలు వినిపించుకోవడం లేదన్నారు.  

కౌన్సిల్ రద్దవుతుందన్న ప్రచారం ప్రస్తుతం జరుగుతోందని...ఈ అధికారం ఎవరిచ్చారని లోకేష్ అడుగుతున్నారని గుర్తుచేశారు. అతడి తండ్రి, తాత కౌన్సిల్ రద్దు చేసిన విషయాన్ని లోకేష్ మరిచినట్లున్నాడని ఎద్దేవా చేశారు. అదే  పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. 

టిడిపి ఎమ్మెల్సీలు ప్రతిబిల్లునీ అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కౌన్సిల్ రద్దుకు ఏడాది, రెండేళ్లు పడుతుందని అంటున్నారని పేర్కొన్నారు. అయితే 1985 ఏప్రిల్ 30న తీర్మానం చేయగా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ జూన్ ఒకటికల్లా దాన్ని ఆమోదింపజేశారు... కేవలం 31 రోజులు మాత్రమే పట్టిందన్న విషయం యనమల గుర్తుంచుకోవాలని దాడి సూచించారు. 

read more  

దేశంలో ఏడు రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉందని దాడి గుర్తుచేశారు. ఇవి అవసరమా? అని ప్రధాని మోదీ గతంలో ప్రశ్నించారని తెలిపారు. ఇప్పుడు ఏపీ శాశనసభ తీర్మానం చేస్తే మిగతా ఆరు రాష్ట్రాలకూ గండం వస్తుందని.... కనుక పెద్దల సభ సరైన నిర్ణయాలు తీసుకుని ప్రతిష్ఠంభన రాకుండా చూడాలని దాడి వీరభద్రరావు సూచించారు. 

 

click me!