సింహాచలం వివాదంలో స్వరూపానందేంద్ర చొరవ: సస్పెన్షన్ ఎత్తివేత

By telugu team  |  First Published May 2, 2020, 8:01 AM IST

సింహాచలం ప్రధానార్చకుడి సస్పెన్షన్ వివాదంలో శారదాపీఠం స్వరూపానందేంద్ర జోక్యం చేసుకున్నారు. దాంతో ప్రధానార్చకుడి సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


విశాఖపట్నం: సింహాచలం వివాదం సద్దుమణిగింది. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చొరవతో సమస్యకు తెర పడింది. ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులపై వేసిన సస్పెన్షన్ వేటును ఉపసంహరించారు. ఈమేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. 

లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరిన సింహగిరిపై  చందనోత్సవ వేళ నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తిని అప్పన్న నిజరూప దర్శనానికి తీసుకువెళ్లినట్లు ప్రధాన అర్చకుడిపై ఆరోపణలు వచ్చాయి. సింహాచలం ఈవో స్పందిస్తూ ... దీనికి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులే కారణమని భావించారు. ఆలయ వర్గాల సమాచారం మేరకు ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేని వ్యక్తి నిజరూప దర్శనానికి వెళ్లిన వివాదం మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రధానార్చకుడి పై సస్పెన్షన్ వేటు వేశారు. 

Latest Videos

undefined

తన సస్పెన్షన్ వేటును వ్యతిరేకిస్తూ ప్రధానార్చకుడు తక్షణం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రను కలిశారు. తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన స్వామి స్వరూపానందేంద్ర తక్షణం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో మాట్లాడారు. ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సస్పెన్షన్ వేయడం సమంజసంగా లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్వామిజీ చొరవతో మంత్రి శ్రీనివాస్ స్పందించి ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్ వేటను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించారు. 

అధికారులు జారీచేసిన ఉత్తర్వుల కాపీని అందుకున్న ప్రధానార్చకుడు గొడవర్తి ఉన్నపళంగా విశాఖ శారదా పీఠానికి వెళ్ళారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర చేతికి తన జాయినింగ్ ఆర్డరును చూపి కృతజ్ఞతలు తెలిపారు. స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో అర్చకులు ఎంతో సంతోషంగా ఉన్నారని స్వామిజీ దృష్టికి తీసుకొచ్చారు. 

దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అర్చకుల వంశపారంపర్య హక్కులపై జీవో జారీ కావడం ఎంతో మంది అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. కరోనా సమయంలో చిన్న చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు సైతం ఐదు వేల రూపాయల చొప్పున జీవన భృతి విడుదల చేయడం కూడా హర్షనీయమన్నారు. విశాఖ శారదా పీఠం చొరవతో రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు మేలు చేస్తోందని చెప్పారు

click me!