కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత భాస్కర రావు దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ నాయకుడు చిన్ని హత్య తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు.
మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భాస్కర రావు దారుణ హత్యకు గురయ్యారు. భాస్కర రావుపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గుండెపై బలమైన గాయం కావడంతో ఆయన మృత్యువాత పడ్డారు.
భాస్కర రావు హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా టీడీపీ నేత చిన్నిని పోలీసులు అనుమానిస్తున్నారు. భాస్కర రావుపై దాడి ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవి కెమెరా దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర రావుపై దాడి జరిగిన తర్వాత చిన్ని ఇంటికి తాళం వేసి పరారైనట్లు భావిస్తున్నారు.
పాతకక్షలే దాడికి కారణమని పోలీసులు చెబుతున్నారు. 2013లో జరిగిన సురేంద్ర హత్య కేసులో భాస్కర రావు నిందితుడని తెలుస్తోంది. ఆ కారణంగానే భాస్కర రావు హత్యకు గురయ్యాడని అంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంత్రి పేర్ని నానికి భాస్కర రావు సన్నిహితుడు.