పవన్ కల్యాణ్ పింఛను పేరుతో మహిళకు జనసైనికుడి టోకరా

By telugu team  |  First Published Jun 25, 2020, 8:49 AM IST

పవన్ కల్యాణ్ పింఛను పేరిట జనసేన కార్యకర్త ఒకతను ఒంటరి మహిళను మోసం చేశాడు. ఒంటరిగా ఉంటున్న మహిళ ఇల్లును కాజేసేందుకు పెద్ద నాటకమే ఆడాడు. మోసం గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


విజయవాడ: సినీ హీరో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కార్యకర్త ఒకతను మహిళను మోసం చేశాడు. 68 ఏళ్ల వయస్సు గల మహిళను నమ్మించి మోసం చేశాడు. పవన్ కల్యాణ్ పింఛను పేరిట అతను ఈ మోసానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకుని ఈ మోసానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

నమ్మించి ఆమె ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దోనెపూడి లక్ష్మి అనే 68 ఏళ్ల వృద్ధురాలు విజయవాడలోని పాయకాపురం సుందరయ్య నగర్ లో నివసిస్తున్నారు. భర్త గతంలో చనిపోయాడు. కుమారుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో ఉంటున్నాడు. పెళ్లి చేసిన తర్వాత కూతురు అత్తారింటికి వెళ్లిపోయింది. దాంతో లక్ష్మి ఒక్కరే ఉంటున్నారు. 

Latest Videos

undefined

ఇటీవల ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లో జనసేన పార్టీ కార్యకర్త బొప్పన శ్యాంసన్ అద్దెకు దిగాడు. మెల్లగా లక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు. పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలకు నెలకు పదివేల రూపాయలేసి పింఛను ఇస్తున్నారని ఆమెను నమ్మించాడు. దాంతో పవన్ కల్యాణ్ పింఛను మంజూరు చేశారని ఓ రోజు పత్రాలతో వచ్చి ఆమె సంతకం తీసుకున్నాడు. 

ఆరు నెలల తర్వాత వచ్చి ఆ ఇల్లు తనదేనంటూ బేరం సాగించాడు. దాంతో తాను మోసపోయానని లక్ష్మి గుర్తించింది. దాంతో ఆమె ఆ విషయాన్ని తన కూతురికి, కుమారుడికి చెప్పింది. వారు బుధవారంనాడు నున్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!