తెలుగుదేశం హయాంలో కంపెనీలు మూతపడ్డాయి...అయినా...: టిడిపి మాజీ ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Dec 10, 2019, 6:24 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సుబాబుల్ రైతులను ఆదుకోవడంలో విఫలమైందని నందిగామ మాజీ ఎమ్మెల్యే, టిడిపి మహిళా నాయకురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు.  

కృష్ణాజిల్లా: అధికారం రాకముందు సుబాబుల  రైతులపై మొసలి కన్నీరు కార్చిన వైసిపి నాయకులు నేడు కమీషన్లకు కక్కుర్తిపడి పేపర్ కంపెనీలతో లాలూచీపడుతున్నారని నందిగామ మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు. గతంలో అన్నదాతలకు అండగా వుంటామన్న వారే ఇప్పుడు వారిని అడ్డంగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కంపెనీలు మూతపడి డిమాండ్ కన్నా సప్లై ఎక్కువగా ఉన్నా నిరంతరం కొనుగోళ్లు చేయించామన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని రైతులతో స్వయంగా మాట్లాడి ఆదుకున్నట్లు పేర్కొన్నారు.  

నియోజకవర్గంలో నిరంతరం కొనుగోళ్లు చేయిస్తున్న సమయంలో రైతులపైన కపట ప్రేమను కురిపిస్తూ పాదయాత్రలు చేసిన నాయకులు నేడు సుబాబులు కొనని పరిస్థితి ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

read more అన్నదాతలకు అండగా... వచ్చే గురువారమే పత్రికా ప్రకటన...: జగన్ 

నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరిగి తాము అధికారంలోకి వస్తే సుబాబులకు రూ.4400 ధర ఇప్పిస్తామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు ఎందుకు తోక ముడిచారని ప్రశ్నించారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లో సైతం సుబాబులుపై నాటకీయ ప్రసంగాలు చేసి రైతులను మభ్యపెట్టిన నందిగామ, మైలవరం శాసనసభ్యులు నేడు నోరు ఎందుకు తెరవడం లేదన్నారు. కంపనీలు కర్రను కొనుగోలు చేయకుండా కాటాలు మూసివేసివున్నా ఆ ఇద్దరు శాసనసభ్యులు మాట్లాడకపోవడం వెనుక ఉన్న అవినీతి బాగోతం ప్రజలందరికి తెలుసన్నారు. 

అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పైన విమర్శలు చేస్తూ తాము సుబాబుల రైతులకు అవసరమైతే ధరల స్థిరీకరణ నిధి నుండి మద్దతు ఇస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని గ్రామ గ్రామం తిరిగి చెప్పిన నేతలు నేడు ఏం చేస్తున్నారని నిలదీశారు.

read more  ఉల్లి కొరతపై జగన్ సంచలన నిర్ణయం...బోర్డర్లు సీజ్‌: మంత్రి కన్నబాబు

 ముఖ్యమంత్రిని ఒప్పించి సుబాబుల్ రైతులుకు న్యాయం జరిగేలా చూస్తామన్న శాసన సభ్యులు నేడు ఎందుకు మాట్లాడటం లేదో తెలుసన్నారు. దీనివెనుక కంపెనీలతో లాలూచీ ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. 

కాంగ్రెస్ హయాంలో ఎస్‌పిఎం కంపెనీ బకాయిలు చెల్లించకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పి 66% వరకు రైతులకు చెల్లించామని గుర్తుచేశారు. అయితే మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లిస్తామని అసెంబ్లీలో గొప్పగా ప్రకటించిన కొత్త ప్రభుత్వం నేడు ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు. 
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సుబాబుల్ కొనుగోలు పునరుద్ధరించడంతో పాటు పాత బకాయిలు తక్షణమే చెల్లించాలని సౌమ్య డిమాండ్ చేశారు.
 

click me!