కృష్ఱా జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును తిరువూరు పోలీసులు ఎట్టకేలకు చేధించారు.
కృష్ణాజిల్లా: తిరువూరు మండలం వావిలాల గ్రామంలో 11 రోజులు క్రితం కనిపించకుండాపోయిన మైనర్ బాలిక క్షేమంగా ఇంటికి చేరుకుంది. పోలీసులు వివిధ కోణాల్లో బాలిక ఆచూకీ కోసం ప్రయత్నించి చివరకు ఆమె జాడను కనిపెట్టగలిగారు. స్కూల్ కి వెళ్ళిన తమ కూతురు 11రోజుల తర్వాత సురక్షితంగా తిరిగి తమ చెంతకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వావిలాల గ్రామానికి చెందిన శ్రీలత స్థానికంగా వుండే ఓ పాఠశాలలో చదువుకుంటోంది. అయితే 11రోజుల క్రితం స్కూల్ కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురయిన తల్లిదండులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో పాటు బాలిక స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎంత ప్రయత్నించినా బాలిక ఆఛూకీ లభించలేదు.
undefined
read more శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
దీంతో తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి శ్రీలత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 11రోజుల తర్వాత అంటే శనివారం వారికి ఆమె ఆఛూకీ లభించింది. ప్రకాశం జిల్లా దోర్నాలలో బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న బాలికను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆమే ఇష్టపూర్వకంగా వెళ్లిపోయిందా అన్న దానిపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా కూతురు తిరిగి తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు.
బాలిక మిస్సింగ్ కేసును ఛాలెంజ్ గా తీసుకుని చాలా కష్టపడి ఆచూకీని కనిపెట్టగలిగామని స్థానిక సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్,ఎస్సై సుబ్రహ్మణ్యంలు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ పూర్తయిన అనంతరం తెలియజేస్తామని వారు వెల్లడించారు.