వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస రావు రాజమండ్రి జైలు అధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు. రాజమండ్రి జైలులో శ్రీనివాస రావు ప్రాణాలకు ముప్పు ఉందని అతని తరఫున న్యాయవాది అబ్దుస్ సలీం ఎన్ఐఎ కోర్టుకు తెలిపారు.
విజయవాడ: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాస రావు రాజమండ్రి కేంద్ర కార్యాలయం అధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు. నిరుడు వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే.
శ్రీనివాస రావును అధికారులు బుధవారంనాడు కొట్టారని అతని తరఫు న్యాయవాది అబ్దుస్ సలీం చెప్పారు. శ్రీనివాసరావును అంతం చేయాలని కుట్ర జరుగుతోందని ఆయన శుక్రవారం నాడు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలని అధికారులు శ్రీనివాస రావుపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
ఆ విషయాలను అబ్దుస్ సలీం ఎన్ఐఎ కోర్టుకు తెలిపారు. శ్రీనివాస రావును మరో జైలుకు మార్చాలని ఆయన కోర్టును కోరారు. జైలు ఆవరణలోని చెట్టు నుంచి బొప్పాయి దొంగిలించావని చెప్పి శ్రీనివాసరావును జైలర్, వార్డెన్ కొట్టినట్లు ఆయన తెలిపారు.
దాడిలో శ్రీనివాస రావు గాయపడ్డాడని చెప్పారు కింది పెదవిపై, గదుమపై గాయాలైనట్లు ఆయన తెలిపారు. రాజమండ్రి జైలులో శ్రీనివాస రావు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన చెప్పారు.