ఏపిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న అక్రమ దాడులను మాజీ మంత్రి దేవినేని ఉమ ఖండించారు. తమ కార్యకర్తలకు ప్రతి నాయకుడు అండగా వుండాలని మంత్రి సూచించారు.
నందిగామ: కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు బనాయించడం పై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు పై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ ఇది పిరికిపందల చర్య గా అభివర్ణించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను, అభివృద్ధి ని పక్కనపెట్టి కక్షపూరితంగా తెదేపా శ్రేణులే లక్ష్యంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలకు పూనుకోలేదన్నారు. అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ అందేలా పని చేసామని అన్నారు.
వైఎస్సార్ రైతు భరోసా పథకం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. గతంలో మా ప్రభుత్వమే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
ప్రజలకు అవసరమైన ఇసుక అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుక దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక లేక నిర్మాణ పనులు నిలిచిపోయాయని...దీంతో కూలీలు పస్తులు ఉంటున్నారన్నారు. తక్షణమే ఉచిత ఇసుక విధానాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు మండల స్థాయి టిడిపి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.