విజయవాడలో మైనర్ బాలురతో కూడిన దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆట కట్టించారు.
విజయవాడ: నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దోపిడీ ముఠా పోలీసులకు చిక్కింది. అరెస్టయిన నిందితుల నుంచి 426 గ్రాముల బంగారు ఆభరణాలు,18లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు.
విజయవాడలో ఇటీవల కాలంలో పగటి పూట ఎక్కువగా చోరీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పద ముఠాలపై ప్రత్యేక నిఘా వుంచిన పోలీసులు చివరకు దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు.
నగరంలో పలు ప్రాంతాల్లో ఈ ముఠా ముందుగా రెక్కీ నిర్వహించి తాళంవేసి వున్న ఇళ్లను చోరీలకు ఎంచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నగర సీపీ ద్వారక తిరుమల రావు ఆదేశాల మేరకు నిఘాని ముమ్మరం చేయడంతో చోరీలకు పాల్పడుతున్న 5 గురు బాలనేరస్థులను అరెస్ట్ చేసామని డిసిపి తెలిపారు.
నగరంలో జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మరో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు డిసిపి వెల్లడించారు. ఈ నేరస్థులపై గతంలో 8 కేసులు ఉన్నాయని తెలిపారు. ఆర్ధిక సమస్యలు, దురలవాట్ల కోసమే వీరు నేరాల బాట పట్టినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.