అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇకపోతే దుర్మరణం చెందిన జయదీప్ మృతదేహాన్ని అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించివేశారు అధికారులు.
విజయవాడ: పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై విషాదం చోటు చేసుకుంది. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోసం ప్రత్యేకంగా షెడ్డులను నిర్మిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి పాత రాజగోపురం వద్ద షెడ్డు నిర్వహిస్తుండగా ఒక కార్మికుడు కాలుజారి కింద పడిపోయాడు. కిందపడిన కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
మృతి చెందిన కార్మికుడు జయదీప్ గా అధికారులు గుర్తించారు. మృతుడు పశ్చిమబెంగాల్ కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇకపోతే ప్రమాద ఘటనను గోప్యంగా ఉంచారు ఆలయ అధికారులు, పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇకపోతే దుర్మరణం చెందిన జయదీప్ మృతదేహాన్ని అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించివేశారు అధికారులు. అయితే రక్తపు మరకలను తుడవకుండా ఇసుకవేసి హడావిడిగా వెళ్లిపోయారు.
అయితే భక్తులు ఆ రక్తపు మరకలను తొక్కుకుంటూనే ఆలయంలోపలికి వెళ్తున్నారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇకపోతే భక్తులు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తపు మరకలు తుడవకుండా ఇసుక వేసి తప్పించుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.